Somu Veerraju Fires On AP Govt Over Govt Employees Issue: ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివాళా తీసిన ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగా.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. సలహాదారుకి సకాలంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సలహాదారుల జీతాలు, వాళ్ళ విధుల మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను దొంగ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని.. హామీలు నెరవేర్చడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందన్న ఆయన.. మీరు ధైర్యంతో పోరాడి హక్కులను సాధించుకోండని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల్లా రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు.
ఇదే సమయంలో జనసేనతో పొత్తు కొనసాగుతోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేనతో బీజేపీ కాపురం బాగుందని, జనసేన శ్రేణులు తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వారాహి వాహన ప్రారంభోత్సవంలో బీజేపీతోనే కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జీతాలు వస్తే.. అదే మహాభాగ్యం అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం తయారు చేసిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలను రాజకీయ పార్టీలుగా చూడొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము నమోదు చేసుకున్న ఓట్లు తమ పునాది అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖను ప్రభుత్వం ఆదాయం రాబట్టుకునే వనరుగా మార్చేసిందని ఆరోపించారు. టీటీడీ సహా ఇతర ఆలయాల్లో భారీగా టిక్కెట్ రేట్లను పెంచేసి.. సామాన్యులను భగవంతుడిని దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం వైఫల్యాలు, వ్యతిరేక ఓటును.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా మలుచుకుంటున్నామని తెలిపారు.
Business Headlines 09-03-23: పాకిస్తాన్‌లో ఆటోమొబైల్ కంపెనీల ప్లాంట్ల మూసివేతలు. మరిన్ని వార్తలు