Business Headlines 09-03-23:
తగ్గిన వెండి.. పెరిగిన స్టీల్..
వెండి ధర భారీగా తగ్గింది. 2 వేల 285 రూపాయలు దిగొచ్చింది. దీంతో కేజీ వెండి రేటు గరిష్టంగా 62 వేల 25 రూపాయలు పలికింది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గటమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం రేటు కూడా 615 రూపాయలు డౌన్ అయింది. 10 గ్రాముల గోల్డ్ అత్యధికంగా 55 వేల 95 రూపాయల వద్ద ఉంది. మరో వైపు.. స్టీల్ రేట్ ఒక్కసారే 2 వేల రూపాయలు పెరిగింది. దీంతో టన్ను ఉక్కు ధర 61 వేల రూపాయలకు చేరింది. ఐరన్ ఓర్ మరియు బొగ్గు వంటి ముడి సరుకుల రేట్లు, డిమాండ్ పెరగటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
రుణాల ముందస్తు చెల్లింపులు
గౌతమ్ అదానీ గ్రూప్ ప్రమోటర్లు.. 7 వేల 374 కోట్ల రూపాయల రుణాలను ముందుగానే చెల్లించారు. షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న ఈ అప్పులను వాస్తవానికి 2025 ఏప్రిల్‌లో తీర్చాల్సి ఉంది. లోన్లు ఇచ్చిన సంస్థల జాబితాలో విదేశీ బ్యాంకులు మరియు ఇండియన్ లెండర్స్ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నేపథ్యంలో గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల రుణాలపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు ముందస్తు చెల్లింపులు చేస్తున్నారు. తద్వారా సంస్థకు మరింత నష్టం జరక్కుండా జాగ్రత్తపడుతున్నారు.
వార్తల్లోకి.. నాట్కో, అరబిందో
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ నాట్కో.. షేర్లను బైబ్యాక్ చేసేందుకు సిద్ధమైంది. 30 లక్షల వరకు వాటాలను స్టాక్ హోల్డర్ల నుంచి తిరిగి తీసుకునేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేర్‌ని 700 రూపాయలు చెల్లించి సొంతం చేసుకోనుంది. ఇదిలాఉండగా.. భాగ్య నగరంలోని మరో ఫార్మా కంపెనీ అరబిందోకి అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అరబిందో అనుబంధ సంస్థ యూజియా ఫార్మా.. లెనలిడోమైడ్ అనే క్యాప్స్యూల్స్‌ని తయారుచేసేందుకు, మార్కెటింగ్ చేసేందుకు FDA అనుమతించింది.
అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా
వాల్‌మార్ట్ కంపెనీకి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాని ఇండియా ఈ ఏడాదే దాటేసే అవకాశం ఉందని ఆ సంస్థ CFO జాన్ డేవిడ్ రైనీ అన్నారు. రెండు దేశాలూ శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లేనని చెప్పారు. భారతదేశంలో తమకు ఫ్లిప్‌కార్ట్ మరియు ఫోన్‌పే ఉన్నాయని గుర్తుచేశారు. ఈ రెండు మార్కెట్లలో దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు, లాభాల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. చైనాతో పోల్చితే ఇండియాలోనే భవిష్యత్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జాన్ డేవిడ్ రైనీ అభిప్రాయపడ్డారు.
డీబీఎస్ సీఈఓ శాలరీ పెంపు
DBS గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ CEO పీయూష్ గుప్తా వేతనం 13 శాతం పెరిగి 11 పాయింట్ 4 మిలియన్ డాలర్లకు చేరింది. నాలుగో త్రైమాసికం ఫలితాలు అంచనాలను మించి రావటంతో ఆయనకు గత ఏడాదికి సంబంధించి ఇవ్వాల్సిన శాలరీని ఈ మేరకు హైక్ చేశారు. ఇందులో 5 పాయింట్ 8 మిలియన్ డాలర్లను క్యాష్ బోనస్ రూపంలో తీసుకున్నారు. ఒకటీ పాయింట్ 5 మిలియన్ డాలర్లను శాలరీ రెమ్యునరేషన్ కింద పొందారు. ఈ విషయాలను DBS బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడించింది. మిగతా సంస్థలు CEOల వేతనాలను తగ్గిస్తుండగా ఈ కంపెనీ పెంచటం చెప్పుకోదగ్గ విషయం.
పాక్‌లో హోండా ప్లాంట్ క్లోజ్
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో మరో ఆటోమొబైల్ సంస్థ తన ప్లాంట్‌ను మూసేసింది. గతంలో పాక్ సుజుకీ మోటార్ కంపెనీ, ఇండస్ మోటార్ కంపెనీ తమ ప్లాంట్లను షట్‌డౌన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. హోండా సంస్థ సైతం ఇదే బాటలో నడిచింది. ప్రధానంగా సరఫరా వ్యవస్థలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని జియో న్యూస్ పేర్కొంది. హోండా అట్లాస్ కార్స్ ప్లాంట్ ఈ నెల 9వ తేదీ నుంచి.. అంటే.. నిన్నటి నుంచి 31వ తేదీ వరకు మూసి ఉంటుంది.