వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. రైతులను దొంగలుగా భావిస్తున్నారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డ ఆయన.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.. మీటర్లు బిగిస్తే 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్న ప్రభుత్వం కామెంట్ల వెనుకున్న అర్థమేంటీ..? రైతులను దొంగలుగా ప్రభుత్వం భావిస్తోందా..? మీటర్లు పెట్టకపోతే వచ్చే నష్టమేంటీ..? అని నిలదీశారు. విద్యుత్ దోచేయడానికి రైతులు దొంగలు కాదు.. ఆదా అయిన కరెంటుతో గృహ విద్యుత్ ఛార్జీలేమైనా తగ్గిస్తారా..? అని ఎద్దేవా చేశారు.
Read Also: Nara Lokesh: జగన్, ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా…!
మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు కేవలం 2 శాతం మాత్రమే ఉంటారు.. అందరికీ కనీస మద్దతు ధర ఇప్పించామని ప్రభుత్వం నిరూపించగలదా..? అని ప్రశ్నించారు సోమిరెడ్డి.. రైతులకు ధాన్యం కొనుగోళ్లల్లో న్యాయం చేశామని ప్రభుత్వం గుండె మీద చేయివేసుకుని చెప్పగలదా? అని సవాల్ విసిరారు. ఏపీలో రెండున్నరేళ్ల జగన్ పాలనలో 2112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. వీళ్లల్లో కౌలు రైతులు ఎక్కువగా చనిపోయారు.. కానీ, ప్రభుత్వం మాత్రం కేవలం 718 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అంటోందని విమర్శించారు. రైతు భరోసా ద్వారా రూ. 1.10 వేల కోట్లు ఇచ్చామని సీఎం జగన్ గొప్పులు చెప్పుకుంటున్నారు.. జగన్ ప్రభుత్వంలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఎమ్మెస్పీతో పోలిస్తే ఎకరానికి రూ. 15 వేల చొప్పున నష్టపోయారు.. ఏపీలో రైతు కుటుంబానికి రూ. 7500 ఇస్తున్నారు.. తెలంగాణలో రైతు బంధు కింద రూ. 10 వేలు ఇస్తున్నారని గుర్తుచేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.