విజయనగరం మైన్స్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డికి ఆ శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బినామీ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఆడియో వైరల్ అవడంతో స్థానికంగా కలకలం రేగింది. అంతేకాకుండా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియా ముందుకు వచ్చిన ప్రతాప్ రెడ్డి.. గనుల శాఖలో కొందరు అధికారులు, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపారని తీవ్ర ఆరోపణలు చేశారు.
దీంతో ప్రతాప్ రెడ్డిపై ఆరోపణలు, మీడియా ముందుకు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. 10రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ ఎడి ప్రతాప్ రెడ్డి అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెట్టి సింహస్వప్నంగా మారారు. పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా దాడులు నిర్వహించడంతో అధికార పార్టీ నేతలు సైతం బెంబేలెత్తిపోయారు.