కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం రానేవచ్చింది.. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీ చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… సర్వదర్శన టోకెన్ జారీ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు అర్ధరాత్రి నుండి టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు.. సర్వదర్శన టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారని.. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవింద రాజ సత్రాల్లో టోకెన్ల పంపిణీ ఉంటుందన్నారు.. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, సదుపాయాలు ఏర్పాటు చేశామని.. శని, ఆది, సోమవారాల్లో రోజుకు 25 వేల టోకెన్ల చొప్పున జారీ చేస్తామని.. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో రోజుకు 15 వేల టోకెన్లు విడుదల చేస్తామని వెల్లడించారు.. అయితే, ఏ రోజుకు ఆరోజు దర్శన టోకెన్ల జారీ ఉంటుందని.. సంబంధిత కోటా టోకెన్లు అయిపోగానే కౌంటర్లు మూసివేస్తామని పేర్కొన్నారు.
Read Also: KTR: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. సంతోషం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి..
టోకెన్ లేని భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. టోకెన్ లేని భక్తులు తిరుమలకు వచ్చి సర్వదర్శనానికి వెళ్లవచ్చు అని తెలిపారు ఈవో ధర్మారెడ్డి.. సర్వ దర్శన టోకెన్ల సంఖ్య క్రమంగా పెంచి భక్తులందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.. ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం ఈ మూడు కేంద్రాల్లో స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్లు జారీ ఉంటుందన్నారు.. మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తున్నామన్నారు.. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.