మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు రోజూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వివేకా కేసులో కథలు అల్లి జగన్ ను ఎలా ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎటువంటి అంశాలపైనైనా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. చివరికి గౌతమ్ రెడ్డి మరణంపై కూడా నీచంగా మాట్లాడే సంస్కృతి వారిది.
రోజూ ఏదో ఒక బురద జల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వివేకా హత్య కేసులో మేము అడిగిన నాలుగు ప్రశ్నలకు చంద్రబాబు, సీబీఐ సమాధానం చెప్పాలి. విచారణలో మమ్మల్ని ఇరికించాలని చంద్రబాబు, పచ్చ మీడియా విశ్వప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు సజ్జల. విచారణ జరుగుతున్న తీరులో కీలక అంశాలు విస్మరించారని మేము భావించాం అన్నారు. అవే మేము ప్రశ్నిస్తున్నాం…లేఖ ఎందుకు సాయంత్రం వరకూ బయటకు రాలేదు. గుండె పోటు అని చెప్పింది ఎవరు అనేది ప్రశ్నించాం.
ఇటు ఉక్రెయిన్ లో ఏపీ విద్యార్థులను తీసుకురావడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాం. ముఖ్యమంత్రి జగన్ విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. ఎంబసీతో కూడా దీనిపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అన్నారు సజ్జల. ఢిల్లీలో ఏపీ భవన్, APNRTS కూడా నిత్యం విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు విమానాల రాకపోకలు లేవు కాబట్టి విద్యార్థుల యోగక్షేమాలపై ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి యూనివర్సిటీలతో సంప్రదించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం. అక్కడి తెలుగు కమ్యూనిటీని కూడా సంప్రదిస్తున్నాం. విద్యార్ధుల్ని, అక్కడ వున్న భారతీయ పౌరులను తీసుకువచ్చేందుకు అన్నివిధాల ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సజ్జల.