NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: ఇప్పటం విషయంలో పవన్‌కు ఆవేశం ఎందుకు..?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పటం విషయంలో పవన్ కళ్యాణ్ కు ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అర్థం కాలేదన్న ఎద్దేవా చేసిన ఆయన.. సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదు.. ప్రభావం పడే అవకాశం ఉన్న ఒక వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడన్నారు.. కానీ, దీనికి పవన్ హైవే పై చేసిన డ్రామా అందరూ చూశారు.. తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు కూడా అదే పని.. ఏమీ లేని విషయాన్ని ఒక సినిమా కథలా తయారు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.. ఇదంతా కుట్రపూరితంగా చేశారని విమర్శించిన ఆయన.. నిజంగా అధికారంలోకి రావాలి అనుకునే రాజకీయ పార్టీలు ఇలా చేస్తాయా? అని ప్రశ్నించారు. 2019లోనూ ఇలానే ప్రజలను రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల..

Read Also: Governor Tamilisai: రాజ్ భవన్ కి ఆ..అమ్మాయి రావడంతోనే విషయం తెలిసింది

అయితే, మూడేళ్లలోనే 30 ఏళ్ళలో చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ చేశారని ప్రశంసలు కురిపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అందుకే చంద్రబాబుకు, ఆయనకు మద్దతు ఇస్తున్న మీడియా సంస్థలకు కడుపు మంట అని ఫైర్‌ అయ్యారు.. ప్రజలతో కనెక్టివిటీ లేకుండా కేవలం ట్విట్టర్ స్పందనల వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు ఎందుకు అర్థం కావటం లేదో? అని నిలదీశారు. జగనన్న ఇళ్ల సోషల్ ఆడిట్ చేస్తారట..! 3 లక్షల ఇళ్ల వరకు సీలింగ్ స్టేజ్ లో ఉన్నాయి.. దీని కంటే ముందు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం చేసిందన్నారు. జనసేనది దిక్కు మాలిన ఆలోచన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసే కదా పవన్ ప్రచారం చేసింది? అని నిలదీసిన ఆయన.. అర్హులైన అందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారు.. ఎన్నికల హామీలో కనీసం ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.. పవన్ ఎప్పుడైనా ఈ విషయం పై ప్రశ్నించారా? అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే కదా పోటీ చేసింది..? ఇది ప్రజలను మోసం చేయటం కాదా? అని మండిపడ్డారు. ఇక, మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి వీరంతా పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.. గమనించటమే కాదు వీళ్ల మోసాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.