Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: పవన్ కళ్యాణ్ కోరిక తీరదు.. వికేంద్రీకరణే మా విధానం

Sajjala Rama Krishna Reddy

Sajjala Rama Krishna Reddy

Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీంకోర్టు భావించిందన్నారు. ప్రభుత్వ విధానాలలో తప్పోపులను నిర్ణయంచాల్సింది ప్రజలే అని.. ఈ అంశం ప్రజా కోర్టులోనే ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సహజ న్యాయానికి, సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలన్నారు. అలాంటపుడు మిగిలిన వ్యవస్థలు జోక్యం చేసుకోరాదని సజ్జల అభిప్రాయపడ్డారు.

సీఎం జగన్ ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకున్నందుకు వైసీపీకి అన్ని ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని ఆధిక్యం ఇచ్చారని సజ్జల అన్నారు. ఒకే రాజధాని ఉండాలి, అక్కడే అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుని ఉంటే గత ఎన్నికల్లో వ్యక్తమయ్యేదని.. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న చంద్రబాబు నిర్ణయానికి ప్రజల మద్దతు లభించలేదని తెలిపారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టలేమని తేలిపోయిందన్నారు. జగన్ మూడు రాజధానులు చట్టం చేసిన తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో జనం మద్దతు తెలిపారన్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

మూడు రాజధానులకు మద్దతుగా డిసెంబర్ 5న కర్నూలులో సభ నిర్వహించే సమయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం సంతోషంగా ఉందని సజ్జల తెలిపారు. సుప్రీంకోర్టు స్టే మా విధానాలను తప్పుబట్టే వారికి మొట్టికాయ లాంటిదన్నారు. త్వరలోనే న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తే న్యాయవ్యవస్థ చెక్ పెట్టవచ్చని.. ప్రభుత్వ నిర్ణయం నచ్చకుంటే ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు. అటు చంద్రబాబును అర్జెంటుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న పవన్ కళ్యాణ్ కోరిక తీరదని సజ్జల జోస్యం చెప్పారు. ప్రజలు పవన్ కోరికను అంగీకరించడం లేదన్న సంగతిని గుర్తించాలని హితవు పలికారు.

Exit mobile version