టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఫైర్ అయ్యారు. రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నాం అని, ఆయన కామెంట్లపై హిందువులు ఇప్పుడు రగిలిపోతున్నారన్నారు. ఆంజనేయుడిపై నమ్మకం లేదనడం హిందువుల మనోభవాలు దెబ్బతీయడమే అని ధ్వజమెత్తారు. అంత పేరు, అంత డబ్బు, ప్రతిష్ట హిందూ దేవుళ్లను ఉపయోగించుకుని తెచ్చుకుంటారని విమర్శించారు. హిందూ దేవుళ్లని, సనాతన ధర్మాన్ని అవమానించే హక్కు ఎవరిచ్చారు?.. హిందూ సమాజం చులకనగా కనిపిస్తోందా? అని రాజమౌళిని యామిని శర్మ ప్రశ్నించారు.
ఈరోజు విజయవాడలో సాధినేని యామిని శర్మ మీడియాతో మాట్లాడుతూ… ‘చట్ట ప్రకారంగా ఏమైనా చేసుకోవచ్చు. సంబంధం లేకుండా హిందూ దేవుళ్లను అంటే ఊరుకోం. దర్శకుడిగా రాజమౌళికి పేరు రావడానికి ఆ దేవుడే కారణం. ఏదో ఒక విధంగా రామ, కృష్ణ అనడం వల్లనే ఆ స్ధాయి వచ్చింది. వ్యక్తిగత అంశాలతో హిందూ దేవుళ్లపై కామెంట్ చేస్తే ఊరుకోం. సినీ ఇండస్ట్రీలో కొంతమంది అహంకారంతో మాట్లాడితే ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని, స్పృహలో ఉండి మాట్లాడాలి. మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. సనాతన ధర్మానికి నిరూపణలు అవసరం లేదు.. వీళ్ళెవరు నిరూపించడానికి. మీరు సినిమాలు చేసుకోండి.. మీ టీజర్ల కోసమో, మీ పబ్లిసిటీ కోసమో వినియోగించుకోవడానికి దేవుడు కమర్షియల్ కాదు’ అని యామిని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. టైటిల్ గ్లింప్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున రాజమౌళి ఓ ఈవెంట్ నిర్వహించారు. గ్లింప్స్ విడియో రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదుకావడంతో.. రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై కామెంట్స్ చేశారు. దేవుడి పైన తనకు పెద్దగా నమ్మకం లేదని, హనుమంతుడు తన వెనుకాల ఉండి నడిపించారని నాన్న చెప్పినపుడు వెంటనే కోపం వచ్చిందన్నారు. హనుమంతుడు ఉంటే ఇదేనా నడిపించేది అని రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.