RK Roja Sensational Comments On Chandrababu Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పవన్ బినామీ అని, చంద్రబాబు ఎప్పుడు సమస్యల్లో ఉంటారో అప్పుడు పవన్ రంగంలోకి దిగుతారని వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్న మమ్మల్ని పిచ్చికుక్కలంటూ టీడీపీ ఆరోపిస్తోందని.. వికేంద్రీకరణను అడ్డుకుంటున్న అచ్చన్నాయుడు వంటి టీడీపీ వాళ్లే గజ్జికుక్కలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలెక్షన్లు, షూటింగ్‌లు, పోటీ చేయడానికి వైజాగ్ కావాలి కానీ రాజధానిగా పనికి రాదా? అంటూ ఈ సందర్భంగా పవన్‌కు రోజా సూటి ప్రశ్న సంధించారు. ఒకప్పుడు తన దృష్టిలో కర్నూల్, వైజాగ్ మాత్రమే రాజధానులు అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వెంటనే ప్లేటు తిప్పేసి మాట మార్చేశారని రోజా విమర్శించారు.
విశాఖ గర్జనకు తరలివస్తున్న ప్రజల్ని చూస్తుంటే.. ఉత్తరాంధ్రలో ఒక రాజధాని కావాలని ఇక్కడి జనాలు బలంగా కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోందని రోజా అన్నారు. 1955-56 సమయంలోనే ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టాలని ఆలోచన చేశారని పుచ్చపల్లి సుందరయ్య లాంటి గొప్ప నాయకులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అటు.. కర్నూల్‌లో ఉన్న రాజధానిని సైతం తీసుకుపోయారన్నారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టి పెట్టుకొని, మూడు రాజధానులు నిర్మించాలని జగన్ నిర్ణయించారని, ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నామని చెప్పారు. అమరావతి సహా కర్నూల్, వైజాగ్ రాజధానులుగా ఉండాలని తాము అడుగుతున్నామే తప్ప.. అమరావతిని అన్యాయం చేయడం లేదన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రతిపక్ష పార్టీల వారు ఆలోచిస్తున్నారని.. తాము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు.
అంతకుముందు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ మూడు రాజధానులు తీసుకొస్తే.. చంద్రబాబు మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టాలని అక్కడి నాయకులు ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్న సమయంలోనే.. పవన్ అక్కడ సభ పెట్టాలని నిర్ణయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అమరావతే రాజధానిగా ఉండాలని.. పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నాయని.. మూడు రాజధానులు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ నిర్ణయించారని అన్నారు.