విశాఖజిల్లాలో టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి కలకలం రేపింది. పాయకరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులు.. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో డ్యూటీలో ఉన్న ఉద్యోగి సత్యన్నారాయణ కారును అడ్డుకున్నారు. ఫీజ్ కట్టి వెళ్లాల్సినదేనని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఇతర సిబ్బంది కూడా అక్కడకు చేరుకోవడంతో మాటమాట పెరిగి చివరకు గొడవకు దారి తీసింది.తమనే అడ్డుకుంటావా అంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు.. టోల్‌ప్లాజా సిబ్బందిపై ఊగిపోయారు. వాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈఘటనలో ఇద్దరు సిబ్బందికి గాయాలు కాగా.. వీరిని మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.