కొంతకాలం నుంచి విభేదాల కారణంగా వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ రామ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు కూడా! ఇప్పుడు వాటన్నింటిని, తమ ఇగోని పక్కనపెట్టి.. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రాయబారం నడిపి, ఆ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల్ని దూరం చేశారు. రాజమండ్రిలోని ఎంపీ భరత్ రామ్ ఇంట్లోనే ఈ సమస్య పరిష్కారమైంది.
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చిన్న చిన్న ఆలోచన విధానాల్ని సరిజేసుకొని, అందరితో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే భరత్ రామ్ ఇంటికి రావడం జరిగిందని స్పష్టం చేశారు. ఇదేమీ రాజకీయ ఎత్తుగడ గానీ, డ్రామా గానీ కాదని క్లారిటీ ఇచ్చారు. కచ్ఛితంగా కలిసి కట్టుగానే ముందుకెళ్తామన్నారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా, జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండేందుకు కృషి చేస్తామని చెప్పారు.
అనంతరం భరత్ రామ్ మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న అభిప్రాయ బేధాల్ని క్లియర్ చేసుకొని, కలిసి ముందుకెళ్తామన్నారు. తనకు, రాజాకు పెద్దరికరంగా అనపర్తి ఎమ్మెల్యే ఉన్నారని, సీఎం సూచనలతోనే అడుగులేస్తామని చెప్పారు. రాబోయే సవాళ్ళని ఎదుర్కోవాలంటే, కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని.. పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తామని అన్నారు. కాగా.. తన ఇంటికి వచ్చిన జక్కంపూడి రాజాకు భరత్ అభినందనలు తెలియజేశారు.