Pregnant Woman Tortured By In Laws In Andhra Pradesh: పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ గర్భంలో ఆడపిల్ల ఉందని తెలుసుకొని.. గర్భంలోనే ఆ పసికందును చంపేందుకు భర్త తరఫు బంధవులు ఆమెకు గడ్డి మంది తినిపించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. కాన్పుకు తీసుకెళ్లేందుకు ఆ మహిళ తల్లి అత్తింటివారికి వెళ్లినప్పుడు.. ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గాడపర్తి శ్రావణి (23)కి కొంతకాలం క్రితం ఆనంద్‌తో వివాహం జరిగింది. పెళ్లికి ముందు అత్తింటి తరఫు వారు మంచివాళ్లని భావించి.. భారీగానే కట్నకానుకలు ఇచ్చి వివాహం జరిపించారు.
కట్ చేస్తే.. శ్రావణి 5 నెలల గర్భం కావడంతో, తమ కుమార్తెను పుట్టింటికి తీసుకు వెళ్లేందుకు ఆమె తల్లి అత్తారింటికి వచ్చింది. కాసేపు మాట్లాడిన తర్వాత, కుమార్తెను కాన్పుకు తీసుకెళ్తానని అత్తింటివారితో చెప్పింది. కానీ, తాను రానంటూ శ్రావణి ఒక్కసారిగా బాత్రూంలో పరుగులు పెట్టింది. లోపలికెళ్లి గడ్డి మందు తాగేసింది. ఇది గమనించిన తల్లి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె ఎందుకిలా చేసిందని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంలో ఆడపిల్ల ఉందన్న నెపంతో, భర్త తరఫు బంధువులు శ్రావణికి దశలవారీగా గడ్డిమందు తినిపిస్తున్నారని వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భర్త ఆనంద్ స్కానింగ్ చేయించగా.. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిసింది.
దశల వారీగా గడ్డి మందు తినిపించడం వల్ల.. శ్రావణి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రావణికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు.. మహిళ ఆరోగ్య పరిస్థితిపై మీడియా వాళ్లు ప్రశ్నించగా, వారిపై అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.