దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు సంవత్సరంన్నర కాలం సాగిన ఈ పోరు, ఎట్టకేలకు ముగిసింది. ఈ పీఠం వైసీపీకే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. న్యాయబద్దంగా ఈ సీటు తమకు దక్కిందని వైసీపీ నేతలు చెప్తోంటే.. అప్రజాస్వామికంగా వైసీపీ ఈ సీటుని కొట్టేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత పత్తిపాటు పుల్లారావు అవే విమర్శలు చేశారు.
దుగ్గిరాల ఎంపీపీ సీటు కోసం వైసీపీ న్యాయస్థానం ఆదేశాల్ని తుంగలో తొక్కి, అప్రజాస్వామికంగా దొడ్డిదారిలో వెళ్ళిందన్నారు. 18 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ-9, జనసేన-1 స్థానాల్ని కైవసం చేసుకున్నప్పుడు.. వైసీపీకి ఎంపీపీ పీఠం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెరవెనుక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సొంత పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేయించి మరీ, ఈ పీఠాన్ని దక్కించుకున్నారన్నారు. న్యాయస్థానం ఆదేశాల్ని పట్టించుకోకుండా ఈ సీటు దోచుకున్న వైసీపీకి ప్రజలు కచ్ఛితంగా గుణపాఠం చెప్పే తీరుతారన్నారు.
ఇదే సమయంలో విద్యా దీవెన నిధుల్ని సక్రమంగా ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందన్నారు. జగన్ నిర్వాకంతోనే 1,31,715 మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు. టీడీపీ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు రూ.2,132 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ అందగా, జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో కేవలం 10 లక్షల 82 వేల మందికి మాత్రమే ఇచ్చిందన్నారు. జగన్‌లో నిరాశ నిస్పృహలు, అసూయ ద్వేషాలు పెరగడం వల్లే ప్రతిపక్షంపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని, ఆయన ప్రభుత్వం ఎంత గింజుకున్నా 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని నమ్మకం వెలిబుచ్చారు.