ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభా ప్రాంగణం వద్దకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఇంకా శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో రోడ్లపై ఉండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సిద్ధం సభ ప్రాంగణం నుంచి రెండు వైపులా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు, వాహనాలు నిలిచిపోవడంతో కార్యకర్తలు, జనాలు నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు.. వీవీఐపీ వాహనాలకు సైతం తిప్పలు తప్పడం లేదు.
ఇదిలా ఉంటే.. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార వైసీపీ. ఐదేళ్లలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని ముఖ్యమంత్రి జగన్ వివరిస్తారని అంటోంది. 6 జిల్లాల్లో 43 సెగ్మెంట్లు టార్గెట్‌గా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించబోతోంది.
మేదరమెట్లలో సీఎం జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు, రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చే సంక్షేమ పథకాలను సీఎం వివరించనున్నట్లు సమాచారం. సభకు 15 లక్షల మంది ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో 4500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.