మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫేస్టో విడుదల చేస్తామని తెలిపారు. మేం చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం అన్నారు. చంద్రబాబు మేనిఫేస్టోకు.. శకుని చేతిలో పాచికలకు తేడా ఉందా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు.. అధికారం పోతుందన్న భయంలేదు.. హిస్టరీ బుక్ లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాక, కరోనా లాంటి కష్టాలు వచ్చినా.. తగ్గేది లేదని ముందుకు వెళ్లామని తెలిపారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలుచేశామని పేర్కొన్నారు.
మూడు పార్టీలు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. 2014లో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలు చేశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు.. మళ్లీ పొత్తుల డ్రామాతో చంద్రబాబు ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. DTS పద్ధతిలో ఏడాదికి రూ.75 వేల కోట్లు ఇచ్చాం.. మన సంక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వాదించారన్నారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలని సీఎం తెలిపారు. మనం అమలు చేస్తున్న 8 పథకాలను ఎవరూ టచ్ చేయలేరు.. ఎవరైనా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.
చంద్రబాబు చెబుతున్న సూపర్-6కు.. ఏటా రూ.73 వేల కోట్లు కావాలని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు చెబుతున్న ఏడో హామీకి రూ.87 వేలకోట్లు కావాలన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ ఇప్పటికే రూ. లక్షా 50 వేల కోట్లు దాటుతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వంలో 58 నెలల్లో 136 సార్లు బటన్ నొక్కి.. రూ. 2 లక్షల 70వేల DBT చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు మీకు మంచిరోజులు తెస్తాను అని చెప్పా.. పేదవారి భవిష్యత్ బాగుండాలంటే.. మళ్లీ జగన్ నే తెచ్చుకోవాలని కోరారు. తనపై అరడజను పార్టీలు.. బాణాలు ఎక్కుపెట్టాయని అన్నారు. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని మన ఇంటికి తెచ్చుకున్నట్లేనని విమర్శించారు. సైకిల్ ఇంటి బయట.. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి.. 175కు 175 అసెంబ్లీ సీట్లు.. 25కు 25 లోక్ సభ సీట్లు గెలవడానికి సిద్ధమేనా సీఎం జగన్ పేర్కొన్నారు.