Police Officials Chase Big Land Scam in Chittoor: చిత్తూరులో సంచలనం సృష్టించిన రూ. 50 కోట్ల విలువ చేసే ప్రైవేట్ భూముల గోల్‌మాల్ రిజిస్ట్రేషన్ కేసుని పోలీసులు చేధించారు. రెవెన్యూ శాఖలోని డొల్లతనాన్ని ఉపయోగించుకొని.. అందుబాటులో లేని యజమానుల కళ్లు గప్పి, భూమి రిజిస్ట్రేషన్ చేసి, కోట్లు గడించాలని ఓ పెద్ద ముఠా ప్రయత్నించింది. అయితే.. దినేష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ భూ కుంభకోణం బట్టబయలైంది. ఈ కేసులో మొత్తం 12 మందిని గత వారం రోజులుగా విచారిస్తున్నారు. వారిలో 9 మంది విలువైన భూముల్ని నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇతరులకు ధారాదత్తం చేసినట్టు తేలింది. మొదటి కేసులో భాగంగా ఏడుగురు డాక్యుమెంట్ రైటర్, వీఆర్ఓ, మహిళతో కూడిన ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన కేసుల్లో ఇంకా విచారణ జరుపుతున్నారు. ఈ భూ కుంభకోణం కేసు విచారణల్లో.. కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్‌లు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖుల పాత్ర ఉందని సమాచారం. దీంతో.. పోలీసులు విచారణను గోప్యంగా జరుపుతున్నారు.
మెట్రో సిటీలలో జరిగే భూదందాలను తలదన్నే విధంగా.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అక్రమార్కులు ఈ కుంభకోణానికి తెగబడ్డారు. విదేశాల్లో ఉన్న యజమానుల భూములు, ఆన్‌లైన్‌లో ఇంకా నమోదు కాని భూములే ఈ ముఠా టార్గెట్. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి, రిజిస్ట్రేషన్లు చేస్తారు. నిందితులంతా చిత్తూరు వాసులే కావడం గమనార్హం. ఈ కుంభకోణంలో ప్రభుత్వ సిబ్బంది హస్తం కూడా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ భారీ స్కామ్‌లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల పాత్ర ఉండటంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. వారిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా ఒక భూమి పత్రాలు పొందిన నరసింహులు నాయుడు అనే వ్యక్తి, బెంగుళూరులోని సిటీ యూనియన్ బ్యాక్‌లో రూ. 18 కోట్లు లోను పొందాడు. లోన్ తీసుకున్నాక అతడు పరారయ్యాడు.