Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఈరోజు జనసేన పీఏసీ సమావేశం జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న కాలనీలు నిర్మాణం అవుతుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మూడు గజాల స్థలం కూడా ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు.
మైకుల ముందే పవన్ కళ్యాణ్ పోరాటం కనిపిస్తోందని.. వాస్తవానికి పవన్ దిగజారిపోయి చంద్రబాబుతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై దాడికి తాము కుట్ర చేయడమేంటని.. ఆయన విజయవాడ ఎన్నిసార్లు వచ్చారో తెలియదా అని ప్రశ్నించారు. ఆయన వాళ్ల పార్టీ ఆఫీస్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఎన్నిసార్లు తిరిగాడో జనసేన నేతలే చెప్పాలన్నారు. ఎప్పుడైనా పవన్‌కు ఏమైనా జరిగిందా అని నిలదీశారు. అసలు ఇప్పుడు పీఆర్పీ ఎక్కడ ఉందని.. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత పీఆర్పీ నేతలంతా కాంగ్రెస్ నేతలే అవుతారని స్పష్టం చేశారు.
Read Also: భార్యలు ఉన్నా మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన హీరోలు వీరే..
వరంగల్‌లో చంద్రబాబు బీసీ గర్జన పెట్టి సోనియా గాంధీని ఆహ్వానించలేదా అని పేర్ని నాని సూటి ప్రశ్న వేశారు. అత్యధికంగా 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. గత వారం బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారని.. ఈ ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమం చేపట్టింది అనేది చర్చించుకుంటున్నారని తెలిపారు. కానీ ఈరోజు జనసేన నేతలు సమావేశమై ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అరాచకాలు సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అన్నారు. అనుమతి తీసుకోకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. ముద్రగడపై దాడి సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని.. కోనసీమలో మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో జనసేన కార్యకర్తలు లేరా అని పేర్ని నాని నిలదీశారు.