Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు. చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్ ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. తాను చాలా పునీతుడినని అన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించలేదని.. ఆనాడు ప్రజారాజ్యం పార్టీని పవన్ ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. రాజకీయాల్లో పవన్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదన్నారు.
Read Also: Sangareddy Collector Sharat: కేసీఆర్ అభినవ అంబేద్కర్.. పొగడ్తలతో ముంచెత్తిన కలెక్టర్
2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్ 2014లో అదే వ్యక్తికి ఓటు వేయమని ప్రజల్ని కోరాడని పేర్ని నాని విమర్శించారు. హైదరాబాద్‌ను విడిచి కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రజా రాజ్యం పార్టీకి, సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. జగన్ మీద పడి ఏడ్వడం తప్ప చంద్రబాబు గురించి ఒక్కరోజైనా పవన్ మాట్లాడారా అని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి నిఖార్సైన నాయకుడు అని.. పవన్ కళ్యాణ్ వారాంతపు నాయకుడు అని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ భ్రమల్లో బతుకుతున్నాడని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తాను గెలిచి తన పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని.. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడని పేర్ని నాని సూటి ప్రశ్న వేశారు.
పవన్ కళ్యాణ్ ఎక్స్‌పైరీ డేట్ గురించి మాట్లాడుతున్నాడని.. ప్రతి వస్తువుకు, వ్యక్తికి ఎక్స్‌పైరీ డేట్ తరహాలోనే పని తీరుకు ఇండెక్స్ కూడా ఉంటుందని పేర్ని నాని అన్నారు. చంద్రబాబుకు తప్పించి పవన్ వల్ల ప్రజలకు ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజారాజ్యాన్ని కొనసాగించాలని అన్న చిరంజీవిని కలిసి ఒక్కసారైనా మాట్లాడావా అని పవన్‌ను నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని.. ఆయన భూమి ఉన్నంత వరకు ఉండరుగా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
