Perni Nani: రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు సంధించారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర టీడీపీ పాదయాత్ర అని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరి పొట్ట కొట్టి డబ్బున్నోళ్లకు పెడుతున్నాడని మండిపడ్డారు. అమరావతి యాత్రలో ఎవరూ రైతులు లేరని.. చంద్రబాబు మనుషులే ఉన్నారని పేర్ని నాని అన్నారు. అయితే టీడీపీ వాళ్లు కనీసం తమ కండువాలు కప్పుకుని ఈ యాత్రలో పాల్గొనే స్థితిలో కూడా లేరని ఎద్దేవా చేశారు. చాలా మంది టీడీపీ కార్యకర్తలు అమరావతి పాదయాత్రలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని పేర్ని నాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎంత మానసిక క్షోభకు గురిచేశారో తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీ నుంచి ఎన్టీఆర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా అసెంబ్లీలో చివరిసారిగా మాట్లాడతాను అని చెప్పినా వినకుండా మార్షల్స్‌ను పెట్టి గెంటాడని పేర్ని నాని విమర్శలు చేశారు.
Read Also:VijayaSaiReddy: రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు.. విజయసాయిరెడ్డి సెటైర్లు
అటు అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. అయితే గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. గుడివాడ శరత్ థియేటర్ వద్ద భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. శరత్ థియేటర్ కొడాలి నానికి చెందినది కావడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది. అటు అమరావతి రైతుల పాదయాత్ర శరత్ థియేటర్ మీదుగానే వెళ్లనుంది. మరోవైపు గుడివాడలో పోలీస్ ఆంక్షలు ఉన్నాయని జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. 600 మందితో యాత్ర చేసేందుకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమరావతి రైతులు పాటించాలని సూచించారు. బాధ్యతారహిత్యంగా వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా హెచ్చరించారు.