గోదావరి వరద తగ్గుముఖం పట్టింది.. జులై నెలలో ఎన్నడూ లేని తరహాలో గోదావరి మహోగ్రరూపం దాల్చి విరిచుకుపడింది.. లంక గ్రామాలను, ఊళ్లను, చివరకు మండల కేంద్రాలను సైతం ముంచెత్తింది.. భద్రాచలం టౌన్‌లోని కొన్ని కాలనీలో కూడా గోదావరి వరదలో చిక్కుకున్నాయి.. చేసేది ఏమీ లేక.. అన్ని వదిలి సురక్షిత ప్రాంతాలను తరలివెళ్లారు ప్రజలు.. అయితే, కోనసీమ జిల్లాలో గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాలు తేరుకుంటున్నాయి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద స్వల్పంగా తగ్గింది గోదావరి వరద ఉధృతి.. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 16.60 అడుగులకు తగ్గింది వరద.. బ్యారేజీ నుండి 15.31 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.. అయితే, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది.. వరద తగ్గుతుండడంతో.. తిరిగి గ్రామాలకు వస్తున్నారు ప్రజలు.. కానీ, అడుగడుగునా పేరుకుపోయిన బురద.. వారికి ఇబ్బందిగా మారిపోయింది.
Read Also: Bill Gates: ప్రధాని మోదీకి బిల్‌గేట్స్ అభినందనలు
రోడ్లు, ఇళ్లు సైతం అడుగు లోతు బురదలో కూరుకుపోయాయి.. దీంతో, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వరద ప్రభావిత గ్రామాల ప్రజలు.. వరద పోయి బురద మిగల్చడంతో.. బురదను తొలగించుకునే పనిలో నిమగ్నమైపోయారు.. ఇళ్లను, ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడంపై దృష్టిసారించారు.. పదకొండు రోజుల పాటు కోనసీమలోని లంక గ్రామాలను ముంచెత్తింది గోదావరి.. వరద తగ్గుముఖం పట్టడంతో చివరకు భారీగా బురద మిగిలింది. రోడ్లు, నివాస గృహాలతో పాటు వాటి పరిసరాల్లో ఉన్న బురదతో లంక గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. బురదను తొలగించడంలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. కోనసీమలో నదీ తీరం వెంబడి ఉన్న పుష్కర ఘాట్లు, ఇతర పాంచాలరేవులు, ప్రధాన రహదారులతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, సచివాలయ భవనాలు, వేల సంఖ్యలో ఇళ్లు బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. ఇక, అంటువ్యాధులు ప్రభలకుండా గ్రామస్థాయిలో పంచాయతీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.. కలుషితమైన నీటిని పరిశుభ్రంగా చేసుకుని తాగాలని.. లేకపోతే రోగాలపాలవుతారని హెచ్చరిస్తున్నారు అధికారులు..