పెగాసెస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. ఇక, ఇదే సమయంలో.. చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని మమతా బెనర్జీ పేర్కొనడంతో ఏపీలో కలకలం సృష్టించినట్టు అయ్యింది..
Read Also: Balineni: జనసేనానిపై మండిపడ్డ ఏపీ మంత్రి.. ఆయనకు అది అలవాటు..!
చంద్రబాబు హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న మమతా బెనర్జీ కామెంట్లతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ పెంచాయి.. అయితే, తాము ఎలాంటి స్పై సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయలేదని చెబుతున్నారు టీడీపీ నేతలు.. పెగాసెస్ సాప్ట్ వేర్ ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు.. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరు.. నిజంగానే పెగాసెస్ సాఫ్ట్ వేర్ మేం కొనుగోలు చేసివుంటే వైఎస్ జగన్ అధికారంలోకే వచ్చేవారా..? మాపై చర్యలు తీసుకోకుండా జగన్ మూడేళ్లపాటు ఆగి ఉండేవారా..? అని ప్రశ్నించారు నారా లోకేష్. కానీ, టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ నిజంగానే చెప్పిఉంటే.. ఆమెకు తప్పుడు సమాచారం అందిఉండొచ్చని వ్యాఖ్యానించారు.. ఇక, ఇదే సమయంలో.. పెగాసెస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గతంలో రాష్ట్ర మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.. పెగాసెస్ సాఫ్ట్ వేర్‌ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందా అంటూ ఓ ఆర్టీఐ దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నకు రిప్లై ఇచ్చిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్… తమ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని ఇప్పటికే స్పష్టం చేశారని.. ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు టీడీపీ నేతలు. మొత్తంగా పెగాసెస్ సెగలు ఇప్పుడు ఏపీని కూడా తాకినట్టు అయ్యింది.