Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం

  • పెదపెంకి సమస్యపై పవన్ సమీక్ష
  • 197 బోదకాలు కేసులతో గ్రామంలో కలకలం
  • రూ.6.18 కోట్లతో డ్రెయిన్లు, రోడ్లు
  • త్వరలో గ్రామంలో పవన్ పర్యటన
Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లా, పెదపెంకి గ్రామ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దశాబ్దాలుగా ఆ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న బోదకాలు (ఫైలేరియా) వ్యాధి సమస్యకు సమష్టి కృషితో చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా అధికారుల సమష్టి కృషితోనే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఒకే గ్రామంలో 197 కేసులు.. వలస బాట పట్టిన జనం

పెదపెంకి గ్రామంలో సామాజిక అంతరాలు, పారిశుద్ధ్య లోపం కారణంగా వ్యాధి వ్యాప్తి తీవ్రంగా మారింది. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండటంతో క్యూలెక్స్ దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల ఒకే గ్రామంలో ఏకంగా 197 బోదకాలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి భయంతో గ్రామంలోని జనాభా దాదాపు 12 శాతం మేర తగ్గిపోయింది. భయాందోళనకు గురైన పలువురు గ్రామస్థులు గ్రామాన్ని విడిచి వలస బాట పట్టారు. పారిశుద్ధ్య లోపంతో పాటు ఇక్కడ డెంగీ, చికున్‌గున్యా కలిగించే దోమల లార్వాలను కూడా అధికారులు గుర్తించారు.

×
×
Ad

రూ.6.18 కోట్లతో మ్యాజిక్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణం

ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ 2018లోనే జనసేన పార్టీ తరపున స్పందించారు. అప్పటి నుంచే ఈ సమస్య పరిష్కారానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ. 6.18 కోట్ల భారీ నిధులతో మ్యాజిక్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టారు. డ్రైనేజీ ఆక్రమణల తొలగింపుతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. మొదటి విడతగా గ్రామంలో ఏర్పాటు చేసిన 20 మ్యాజిక్ డ్రెయిన్లు అక్కడ పారిశుద్ధ్య విప్లవానికి నాంది పలికాయి.

అభివృద్ధి నమూనాగా పెదపెంకి.. త్వరలో ఉప ముఖ్యమంత్రి పర్యటన

గ్రామస్థులను ఒప్పించి, వారి సహకారంతోనే అధికారులు ఈ అభివృద్ధి పనులను పూర్తి చేశారు. మురుగు నీరు ఎక్కడా నిల్వ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పెదపెంకి గ్రామం ఒక అద్భుతమైన అభివృద్ధి నమూనాగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ విజయాన్ని సాధించిన జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, త్వరలోనే తాను స్వయంగా పెదపెంకి గ్రామాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.