NTV Telugu Site icon

Pawan Kalyan: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు.. రౌడీలు రాజ్యాలు ఏలకూడదు..!!

Pawan Kalyan Janasena Party

Pawan Kalyan Janasena Party

Pawan Kalyan: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ తమ నేతలకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన తమ పార్టీ నేతలను శనివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ శాలువాలను కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నేతల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మానవాళికి ప్రజాస్వామ్యం ఒక వరమని, సామాన్యుల హక్కులకు రక్షణ దక్కితేనే.. ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్నారు. రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలు అందరికీ సమానమేనని.. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవని, రౌడీలు రాజ్యాలు ఏలకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Ysrcp Sketch For Pawankalyan Live: పవన్ కళ్యాణ్ కోసం వైసీపీ స్కెచ్

అటు అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది తమ భూమి.. తమ నేల అని.. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని.. ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. రౌడీలు రాజ్యమేలకూడదన్నదే జనసేన లక్ష్యమన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నవారు రౌడీలు మాదిరి ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా ఈ రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారోనన్న భయం ఉందని పవన్ పేర్కొన్నారు.