NTV Telugu Site icon

Pawan Kalyan: 12 కుటుంబాలకు రూ.60 లక్షలు అందించిన జనసేనాని

Janasena Party

Janasena Party

Pawan Kalyan: విశాఖ పర్యటనలో పోలీసుల ఆంక్షల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్‌లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేయాల్సి ఉంది. అయితే సభలు, సమావేశానికి పోలీసులు అభ్యంతరం తెలపడంతో నోవాటెల్ హోటల్‌లోనే పవన్ కళ్యాణ్ ఈ చెక్కులు పంపిణీ చేశారు.

Read Also: ప్రపంచంలోని 10 అతిపెద్ద అడవులు

మరోవైపు నోవాటెల్ హోటల్‌లో పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అటు తనకు సంఘీభావం తెలిపిన ప్రజా నేతలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పలు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఎటువంటి అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తుందో అందరూ చూశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. ప్రభుత్వం పోలీస్ శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడాన్ని చంద్రబాబు ఖండించారని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తెలిపారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడా తనకు ఫోన్ చేసి ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారని పవన్ వివరించారు.

Show comments