YS Jagan Palnadu Tour: పోలీసుల వేధింపులతోనే పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చెందిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎలక్షన్ కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని జగన్ చెప్పారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడిచేశారన్నారు. ఊరు విడిచిపోవాలని, లేదంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని నాగమల్లేశ్వరరావును సీఐ బెదిరించారని జగన్ ఆరోపించారు. జూన్4న కౌంటింగ్ మొదలైతే, ఐదో తేదీ రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచారని చెప్పారు. తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించాడని జగన్ చెప్పారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడని… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని జగన్ చెప్పారు.
నాగమల్లేశ్వరరావు భార్య, కూతురుకు సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడిచేసిన వారిలో ఎంతమందిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. సీఐపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? ఇదే నియోజకవర్గంలో లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిలిచి ఇబ్బంది పెట్టారని జగన్ గుర్తు చేశారు. కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొందరు పనిచేస్తున్నారని ఆరోపించారు. లక్ష్మీనారాయణ పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పారు. కమ్మవారు వైసీపీలో ఉండకూడదా.. అని జగన్ ప్రశ్నించారు. అయితే, ఉదయం తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయల్దేరిన జగన్… సాయంత్రం సమయానికి రెంటపాళ్ల చేరుకున్నారు. గ్రామంలోకి రాగానే క్రేన్ల సాయంతో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు వైసీపీ నేతలు. ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు జగన్. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Read Also: Phone Tapping Case: మావోయిస్టులను పేరు వాడుకుని.. బడా నేతల ఫోన్లు ట్యాప్..!
జగన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గుంటూరులో జగన్ కాన్వాయ్ వెళ్ళే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి రెంటపాళ్లకు చేరుకున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జగన్ కాన్వాయ్‌లోని ప్రైవేట్ కారు… ఏటుకూరు రోడ్డులో ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని GGHకు తరలించారు పోలీసులు. అయితే.. దారిలోనే అతను మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య అని చెప్తున్నారు పోలీసులు. సత్తనెపల్లి పర్యటనలో మరో వ్యక్తి మృతిచెందాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం దగ్గర సొమ్మసిల్లి పడిపోయాడు కార్యకర్త. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయింది.