ఉల్లిపాయలు.. ఇవి లేకుంటే కిచెన్ లో అంతే సంగతులు.. ఒకప్పుడు ఉల్లిపాయలు కొనాలంటే వినియోగదారులకు చుక్కలు కనిపించేవి. కానీ ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లి పంట కోత దశలోనే రైతులకంట కన్నీరు పెట్టిస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో కర్నూలు జిల్లా రైతులు తమ పంటలను కోత దశలోనే ధ్వంసం చేస్తున్నారు. పంటను మార్కెట్ కు తీసుకుపోతే కనీసం రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు.
Read Also: Ranbir Kapoor: రణబీర్ కపూర్ అందులో ఉన్నట్టా? లేనట్టా?
షఫి ఆంజనేయులు వెంకటేశ్వర్లు అనే ముగ్గురు రైతులు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన వారు.వీరు తమ పొలాలలో ఉల్లి పంటను వేశారు. ఎకరాకు డెబ్భై వేల రూపాయల ఖర్చు వచ్చింది. అయినా ధరమీద నమ్మకంతో పంటను సాగు చేశారు. పంట ఏపుగా పెరిగి కోత దశకు వచ్చింది. కాని ఇంతలో మార్కెట్ లో ధర ఢమాల్ అనడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. క్వింటాలు ఉల్లి మూడు వందల నుంచి ఏడు వందల లోపే వుండటంతో హతాశులయ్యారు. కనీసం కూలీ రవాణా ఖర్చులు కూడా రావని తేలడంతో వీరి కడుపు మండిపోయింది. అంతే మూకుమ్మడిగా తమ పంటలను ట్రాక్టర్ తో దున్నించారు.పంటను కోసిన మరికొందరు రైతులు వాటిని తమ పొలంలోనే గొర్రెలమందకు మేతగా వదిలేశారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ధర లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Spielberg-Tom Cruise: కలుసుకున్న స్పీల్ బెర్గ్ – టామ్ క్రూయిజ్ !