గత నెల 18న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అయితే.. అభ్యంతరాలు స్వీకరణకి నెల రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం.. గడువు ముగియడంతో ప్రభుత్వానికి అభ్యంతరాలపై నివేదిక కలెక్టర్ అందజేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని గత నెల 24 జరిగిన భారీ విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు, బస్సులు దగ్ధం చేశారు ఆందోళనకారులు. అల్లర్లలో పాల్గొన్న 258 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు 217 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నారు. అయితే.. మిగతా వారిని పట్టుకోవడానికి 7 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కోనసీమ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు ఎఫ్ఐఆర్ లునమోదు చేశారు పోలీసులు.
జిల్లాలో 144 సెక్షన్ ఇంకా అమలులోనే ఉంది. గత నెల 24 నుంచి 15 రోజుల పాటు జిల్లాలో 16 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు కూడా. అయితే.. ఈ రోజు జిల్లా పేరు మార్పు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 1300 మంది పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కోనసీమకు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లపై కలిపి ఒకేసారి విచారణ చేయనుంది హైకోర్టు.