తానొకటి అనుకుంటే… పైవాడు ఇంకోటి తలచాడన్నట్టుగా ఉంది ఆ సీనియర్ లీడర్ పరిస్థితి. చివరిదాకా టిక్కెట్ నాదేనని అనుకున్నారాయన. టీడీపీ పెద్దలు కూడా అదే భ్రమలో ఉంచారు. లాస్ట్ మినిట్‌లో తగిలిన షాక్‌కు గింగిరాలు తిరిగిన ఆ మాజీ ఎమ్మెల్యే వెంటనే తేరుకుని నట్లన్నీ బిగించేశారు. ఇప్పుడు పార్టీ పెద్దలు ఓపెన్ చేద్దామన్నా వీలుకానంత గట్టిగా బిగుసుకుపోయింది వ్యవహారం. ఇంతకీ ఎవరా లీడర్? ఏంటాయన టిక్కెట్ వ్యవహారం? అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశానికి కొన్ని చోట్ల తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ దెబ్బకు పార్టీ ముఖ్యులకు సీసాల మీద సీసాల జండూబామ్ అయిపోతోందట. పొత్తుల కోసం సీట్లు వదులుకోవాల్సి రావడం ఒక ఎత్తయితే… ఇన్నేళ్ళు నియోజకవర్గాల్లో ఖర్చుపెట్టి పని చేసుకున్న కొందరికి టిక్కెట్స్ రాకపోవడం మరో సమస్య. ఈ పరిస్థితే అధిష్టానానికి తీవ్ర సంకటంగా మారిందంటున్నాయి టీడీపీ వర్గాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారన్న ప్రకటన తర్వాత ఆ నియోజకవర్గ టీడీపీలో ఎంత అలజడి రేగిందో… ఇప్పుడు అనంతపురంలో కూడా అంతకు మించి అన్నట్టుగా ఉందట వ్యవహారం. పిఠాపురం ఎపిసోడ్‌కు శుభం కార్డ్ పడి ఆల్‌సెట్ అనుకుంటుండగా… అనంతపురంలో మాత్రం ఇంకా నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడమే. పార్టీలో సీనియర్ నాయకుడు చౌదరి. అంతకు మించి లోకల్‌గా గ్రిప్ ఉన్న నాయకుడు. గడిచిన 15ఏళ్ల నుంచి ఇక్కడ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే టాప్ ఫైవ్‌లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం. అలాంటి నాయకుడికి కాకుండా….టికెట్ మరొకరికి ఇచ్చింది అధిష్టానం. అసలీ పరిణామాన్ని ప్రభాకర్ చౌదరితో పాటు నియోజకవర్గ నేతలు ఎవ్వరూ ఊహించలేదట. చివరి జాబితా ప్రకటించిన తర్వాతగాని అధిష్టానం మదిలో ఏముందో, ఎవరున్నారో అర్ధం కాలేదంటున్నారు. పార్టీలో టికెట్ కోసం చాలామంది ప్రయత్నించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు దక్కింది అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్.
దీంతో ప్రభాకర్ చౌదరి వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. జిల్లా పార్టీ కార్యాలయం పై దాడిచేసి ఫర్నిచర్, ప్రచార కరపత్రాలు, చంద్రబాబు ప్లెక్సీలు ఇలా…దేన్నీ వదలకుండా ధ్వంసం చేశారు. మొత్తం రోడ్డుపైకి తీసుకొచ్చి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు స్థానిక కార్యకర్తలు. అలాగే తర్వాత అర్బన్ నియోజకవర్గ కార్యాలయానికి కూడా వచ్చి అక్కడ సైతం చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలు మొత్తం దహనం చేశారు. ఇటు రుద్రంపేట కార్యాలయంలో కూడా సేమ్ సీన్. ఇలా… మూడు రోజుల పాటు వరుసగా నిరసనలు కొనసాగాయి. అనంతపూర్ అర్బన్ అభ్యర్థి కోసం ఐవిఆర్‌ఎస్ సర్వేలు నిర్వహించింది పార్టీ. ఐదారుగురు పోటీ పడ్డా.. కార్యకర్తలు మాత్రం ప్రభాకర్ చౌదరి వ్తెపు మొగ్గు చూపారు. కానీ… చివరికి ఆయనకు టికెట్ రాకుండా కొంతమంది కీలక నాయకులు తెరవెనక పనిచేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు జనసేన కూడా అర్బన్ స్థానం మాకు కావాలని అడిగింది. అయినా సరే… పట్టు వదలకుండా టిక్కెట్ల ప్రకటనకు మూడు రోజుల ముందు కూడా చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు కలిశారు ప్రభాకర్ చౌదరి. అప్పుడు సైతం ఆయనకే టికెట్ అన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఫైనల్ లిస్ట్‌లో దగ్గుబాటి ప్రసాద్ తెర మీదికి వచ్చారు. ఈ పరిణామంతో తీవ్రంగా రగిలిపోయింది చౌదరి వర్గం. ముందు నుంచి టిక్కెట్ నీదేనని ఊరించి ఊరించి… తీరా లిస్ట్‌లో పేరు లేకపోవడం అవమానించడం కాదా అని అడుగుతున్నారు ఆయన అనుచరులు. ఇదే సమయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి జిల్లాలో టికెట్ రాక అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారాయన. దీంతో అప్రమత్తమైన అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. బుజ్జగింపుల పర్వం మొదలైనా…. అధిష్టానం పెద్దల ఫోన్లు కూడా ఎత్తడం లేదట మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తో పాటు మరికొందరు నాయకులు ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. అయినాసరే… చౌదరి మెత్తబడినట్టుగా కనిపించడం లేదట. దీంతో ఆయన అడుగులు ఎటువైపు పడతాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సైతం ఆ దిశగా పూర్తి స్థాయి ప్రణాళికతో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో అనంతపురం అర్బన్ టికెట్ వ్యవహారం పెద్ద అలజడే రేపుతోంది. చివరికి ప్రభాకర్ చౌదరి అధిష్టానం చెప్పినట్టు వింటారా? లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అన్నది చూడాలి.