కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కల బందరు పోర్టు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో బందరు పోర్టు నిర్మాణానికి బీజం పడింది. శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పట్లో మారిన రాజకీయ పరిణామాలతో బందరు పోర్టు నిర్మాణం కాగితాలకే పరిమితం అయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పోర్టు నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసింది. పోర్టు నిర్మాణం పేరుతో కొంత భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ సుదీర్ఘ ప్రక్రియ ఉండగానే 2017లో పోర్టు ఉన్న భూమికి పర్యావరణ అనుమతుల కాలం చెల్లిపోయింది. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు మరోసారి శంఖుస్థాపన చేశారు చంద్రబాబు. ఆ తర్వాత కోర్టు కేసులు ఇతరత్ర వ్యవహారాల వల్ల మరో మూడేళ్లు గడిచిపోయింది. తాజాగా వ్యవహారాలన్నీ కొలిక్కి వచ్చాయ్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 75శాతం అప్పుగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అటు వైపు పర్యావరణ అనుమతి కోసం ఢిల్లీ స్థాయిలో బందరు ఎంపీ బాలశౌరి ప్రయత్నాలు చేశారు. దీంతో త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంత వరకు కథ సాఫీగానే నడిచినా…అసలు ట్విస్ట్ ఇక్కడే మొదయింది.
Read Also: Off the Record about Vizag YCP: విశాఖ జిల్లాలో తగాదాలపై వైసీపీ ఫోకస్
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ ఆమోద పత్రం రాగానే…స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఆ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి ఘనంగా ప్రకటించారు. పనిలో పనిగా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లు చేయడానికి కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. ఈ ఎపిసోడ్‌తో ఎంపీ వర్గం…పేర్ని నానిపై కారాలు మిరియాలు నూరుతోంది. ఢిల్లీ లెవల్లో తాము చేసిన పనులను ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణ మంజూరులో తమ ప్రయత్నాన్ని ఎమ్మెల్యే కరివేపాకులా పక్కన పెట్టడాన్ని తప్పుబడుతోంది. పవర్ ఫైనాన్స్ అంటే ఏంటో తెలియని వాళ్లు కూడా తామే సాధించామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేస్తోంది. అటు నేషనల్ హైవే అప్ గ్రేడేషన్ అంశాన్ని ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవటాన్ని ప్రశ్నిస్తోంది. 4 లేన్ల రోడ్డును 6 లేన్ల చేయాలని లోకల్ ఎంపీ ఇచ్చిన ప్రతిపాదనపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ…ఎంపీని రెఫర్ చేస్తూ రాసిన లేఖను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎంపీ వర్గీయులు పోర్టుకు పర్యావరణ అనుమతులను పునరుద్దరించడానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిసిన విషయాన్ని ఎంపీ వర్గం గుర్తు చేస్తోంది. బందరు పోర్టుకు రుణం తీసుకొని రావడంలో ఎంపీ చూపిన చొరవతో భావనపాడు పోర్టు వ్యవహారాల బాధ్యతను కూడా ముఖ్యమంత్రి జగన్…ఎంపీ బాలశౌరిపై పెట్టారని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది.
చివరకు శంకుస్థాపన తేదీల విషయంలోనూ ఎంపీ ఒక మాట చెబితే…ఎమ్మెల్యే మరో డేట్ ఫిక్స్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా బందరు పోర్టు శంఖుస్థాపన చేయనున్నట్లు ఎంపీ ప్రకటించారు. ఆనందంతో ఉబ్బితబ్బిబై ఎంపీ ఆ తేదీ ప్రకటించారంటూ…ఎమ్మెల్యే ఓపెన్‌గానే వ్యంగ్యస్త్రాలు వదిలారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య ఉన్న ఈ విభేదాలు…ఇక్డితో ఆగేటట్లు లేవు. వచ్చే ఎన్నికల్లో ఒకరిని ఒకరు ఊడగొట్టుకునే వరకు వెళ్లే పరిస్థితి ఉందని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయట. మరి పార్టీ హైకమాండ్ ఈ ఎపిసోడ్‌కు ఎలా బ్రేకులు వేస్తుందో చూడాలి.