ఆ వైసీపీ నాయకుడు తూర్పుకు తిరిగి దండం పెట్టేశారా? రాజకీయం చేయడం ఇక నావల్ల కాదు బాబోయ్… అంటూ దండం పెట్టేశారా? ఒకప్పుడు తోపు అనుకున్న ఆ లీడర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో… పార్టీ కూడా లైట్ తీసుకుందా? పొరుగింటి పుల్లకూర మనకు వర్కౌట్ కాదని డిసైడై… లోకల్ రాగం పాడుతోందా? ఏదా నియోజకవర్గం? సైలెంట్‌గా సైడైపోయిన ఆ నాయకుడెవరు? ఆవిర్భావం నుంచి వైసీపీ అధిష్టానానికి తీరని కల… విశాఖ నగరంలో జెండా ఎగరేయడం. సిటీలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని బీట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డిన ఫ్యాన్ పార్టీ…. మెజార్టీలను మాత్రం ప్రభావితం చేయగలిగింది. మిగిలిన సీట్ల సంగతి పక్కన బెడితే విశాఖ తూర్పులో అయితే…. వైసీపీకి మరీ టఫ్ సిచ్యూయేషన్. ఇక్కడ 2024లో వరుసగా నాలుగోసారి టీడీపీ తరపున గెలిచారు వెలగపూడి రామకృష్ణబాబు. దాదాపు ఫెవికాల్ వేసి అతుక్కుపోయినట్టుగా ఉన్న వెలగపూడిని కుర్చీ దించేందుకు చాలా ప్రయోగాలు చేసింది వైసీపీ. అయినా నో యూజ్. ఇక గత ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘వై నాట్ ఈస్ట్’ నినాదంతో రంగంలోకి దిగారు అప్పటి విశాఖ ఎంపీ, ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ. ఎంవీవీ, వెలగపూడి ఒకే సామాజిక వర్గం కావడం, అధికార బలం, ఆర్ధిక స్తోమత ఆధారంగా ‘తూర్పు’ సెంటిమెంట్ మారుతుందా..? అనే విస్త్రతమైన చర్చ జరిగింది అప్పట్లో. కానీ…. రిజల్ట్ చూసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట ఎంవీవీకి. వెలగపూడి మెజార్టీతో సమానమైన ఓట్లు కూడా సాధించలేకపోయారు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ. ఆ దెబ్బకు ఇక నో పాలిటిక్స్. ఓన్లీ….బిజినెస్ అంటూ సైలెంట్ అయిపోయారు మాజీ ఎంపీ. సింగిల్ షాట్ లోనే ఆయన సైడైపోవడంతో… విశాఖ తూర్పులో వైసీపీకి దిక్కులేనట్టయింది. ఇక్కడ కూటమికి దక్కిన విజయంకంటే…ఎంవీవీని కోలుకోలేని దెబ్బ కొట్టడం మంచి మజా తెచ్చిందట. కాపు, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ అధికంగా వుండే విశాఖ తూర్పులో హయ్యర్, మిడిల్ క్లాస్ మొదటి నుంచి టీడీపీ పక్షానే నిలబడింది. లోకల్‌గా వైసీపీని బలోపేతం చేయడం కోసం రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తిన్న వంశీకృష్ణ యాదవ్…. ఎంవీవీ ఎంట్రీని జీర్ణించుకోలేక జనసేనకు వెళ్లిపోయారు.
ఆ పార్టీ తరపున దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక వెలగపూడితో ‘ఢీ అంటే ఢీ’ అన్న అక్కరమాని విజయనిర్మల కూడా టీడీపీ గూటికి చేరిపోయారు. జనసేన ఓటింగ్ పక్కాగా టీడీపీకి ట్రాన్సఫర్ అవ్వడంతో వైనాట్ అన్న ఎంవీవీ సత్యనారాయణ తుపాకీ గుండుకు దొరక్కుండా పోయారు. అలా… నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వం లేకుండా పోయాకగానీ… వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదట. ప్రయోగాలన్నీ విఫలం అవడమేగాక…. వాటి వల్ల ఎదురైన దుష్పరిణామాలు విశ్లేషించుకుని ఇక నుంచి స్ధానిక నాయకత్వానికే బాధ్యతలు ఇవ్వాలని డిసైడై…. సీనియర్ నేత మొల్లి అప్పారావుకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. దీని ద్వారా యాదవ సామాజిక వర్గానికి తిరిగి దగ్గరయ్యేందుకు వైసీపీ ప్రయ త్నాలు మొదలెట్టినట్టైంది. ఇక్కడ బీసీలు ఎక్కువ కావడంతో ఇక ఆ యాంగిల్‌లోనే రాజకీయం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఎంవీవీ కారణంగానే వంశీ, అక్కరమాని ఫ్యామిలీకి వైసీపీలో అవకాశం లేకుండాపోయిందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ క్రమంలో బీసీల ఆదరణ పొందగలిగితే తప్ప మరోసారి ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదని ఫ్యాన్ పార్టీకి అనుభవం మీద అర్ధం అయిందట. అందుకే… ఇక ఎంవీవీ సత్యనారాయణ గురించి ఆలోచించకుండా… లోకల్ లీడర్ షిప్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు యాదవ, తూర్పుకాపు, పద్మశాలి, శెట్టి బలిజ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పొరుగింటి పుల్లకూరను పక్కకు పెట్టి.. నాలుగేళ్ళు ముందుగానే లోకల్ రాగం అందుకున్న వైసీపీ… విశాఖ తూర్పులో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు.