తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్‌ఎస్ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చినట్లు తెలిపారు.మొత్తం 623 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హిజాబ్ వివాదం ముదిరి చెలరేగిన ఘర్షణల కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.సమస్య పరిష్కారమయ్యేంత వరకు విద్యార్థులు ఎవరూ మతపరమైన దుస్తులను ధరించకూడదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మినహా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేంద్రం వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.జనవరి 24న దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని.. ఇప్పుడు 4.44 శాతానికి చేరింది. కరోనా తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచించింది.
సీఈఓ శశాంక్ గోయల్ ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. తదుపరి సీఈఓ కోసం ముగ్గురు ఐఏఎస్ ల పేర్లను ఈసీకి పంపింది ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా సీఈఓ శశాంక్ గోయల్ ను రిలీవ్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సీఈవో శశాంక్ గోయల్ ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఈ ఏడాది జనవరి 18న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంఛార్జి సీఈఓగా ప్రస్తుత అడిషినల్ సీఈఓ బుద్ధ ప్రకాష్ ని నియమించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించింది టీఎస్ఆర్టీసీ. ఇక నుంచి రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గరుడ ప్లస్ ఛార్జీలు హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ 100, హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ 111, హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ 121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 తగ్గించామన్నారు సజ్జనార్.