NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడో రోజు కూడా నిలిచిపోయింది. ఈ పథకం కింద సేవలు అందించే స్పెషాలిటీ ఆసుపత్రులు తాత్కాలికంగా సేవలను ఆపేశాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులకు చికిత్స అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తమ డిమాండ్లను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేశారు. సీఈఓ ఆమోదించిన రూ.550 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఇకపై ప్రతి నెలా రూ.800 కోట్ల చొప్పున బిల్లులు చెల్లించేలా వ్యవస్థను రెగ్యులర్ చేయాలని కోరారు.
Read Also: Vanasthalipuram : మద్యం మత్తులో థార్ కారుతో రెచ్చిపోయిన యువకులు!
అయితే, ప్రస్తుతం 2,700 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండటంతో ఆసుపత్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించేలోపు మిగిలిన బిల్లుల చెల్లించడానికి రెడీ కావాలని పేర్కొన్నారు. అలాగే, ఎన్టీఆర్ వైద్యసేవ ప్యాకేజీల రేట్లను ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలని నెట్ వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరోగ్య సేవా పథకాలతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్‌లో ప్యాకేజీ రేట్లు 30 నుంచి 40 శాతం తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Jubilee Hills By Election: రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
అలాగే, గ్రీవెన్స్ కమిటీ సమావేశాలను నియమితంగా నిర్వహించాలని, సీఈఓలను తరచుగా మార్చేయడం వల్ల సమాచార లోపానికి, విధానాల అమలులో ఆటంకాలకు కారణమవుతోందని నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు పేర్కొంటున్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకునే ముందు స్పెషాలిటీ ఆసుపత్రులను చర్చల్లో భాగం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్‌తో చర్చించిన తరువాతే UHC అమలుపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ డిమాండ్లపై సమీక్షిస్తుంది. రాబోయే రోజుల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.