కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పెరుగుతున్నాయి. అయితే గతంలో ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ బాధితులకు సేవలందించింది. ఎంతో మంది కోవిడ్ సోకినవారికి ఉచితంగ మందులు అందించింది. ప్రస్తుతం మళ్లీ కరోనా రక్కసి కోరలు చాస్తున్న క్రమంలో కోవిడ్ బాధితుల కోసం మళ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ రంగంలోకి దిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి సూచనలతో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ బాధితులకు టెలిమెడిసిన్ కోసం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఆన్‌లైన్ ద్వారా వైద్యులతో కోవిడ్ బాధితులు మాట్లాడే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని నిపుణులతో వైద్య బృందం ఏర్పాటు చేశారు. ఈ వైద్య బృందంలో ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు లోకేశ్వరావు కూడా ఉన్నారు. రోజూ ఉదయం 7 గంటలకు ఆన్‌లైన్‌లో కోవిడ్ రోగులకు సూచనలు చేయనున్నారు. రోగులకు కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మందులు, మెడికల్ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతేడాది రూ.175 కోట్లతో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ వేళ లక్షలాది మందికి ఇంటి వద్ద ఆహారం అందించింది.