తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్దరించలేదని టీటీడీ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు టీటీడీ అధికారులు.
ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం ట్రోల్ అవుతోంది.
అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి పలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చాక ఈ దర్శనాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడం జరుగుతుంది.
అధికారిక ప్రకటన వెలువడే వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతోంది. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మీడియా ద్వారా తెలియచేస్తామని, అప్పటివరకూ దర్శనాల విషయంలో అవాస్తవాలు నమ్మవద్దని టీటీడీ కోరుతోంది.