Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్ఎం గ్రేడ్-2 ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబ్ ఛార్ట్‌ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని లోకేష్ ఆరోపించారు. సెలవులు, పండగలు, పబ్బాల ఊసే లేకుండా చేశారని.. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా పని చేయిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మండిపడ్డారు. శిక్షణ కూడా లేని వీరిని ప్రమాదకరమైన 11కేవీ 33 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులకు, స్థంభాలు ఎక్కిస్తుండడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ విద్యుత్ ప్రమాదాలలో 89 మంది మరణించారని..200 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని లేఖలో వివరించారు.
Read Also: Sivaji: అది గోరంట్ల మాధవ్ వీడియో కాదు.. నాదే
ఇండస్ట్రియల్ యాక్ట్ కింద ఉండాల్సిన నియామకాలను సచివాలయం కింద చూపిస్తూ…లేబర్ యాక్ట్ అమలు చేయడంతో ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదాలకి గురైన ఎనర్జీ అసిస్టెంట్లు పరిహారంలోనూ అన్యాయానికి గురయ్యారని లోకేష్ తన లేఖలో వివరించారు. ఈ అన్యాయంపై ప్రశ్నించే హక్కు కూడా లేదని అధికారులు బెదిరిస్తున్నారని ఎనర్జీ అసిస్టెంట్లు వాపోతున్నారని తెలిపారు. సచివాలయాల్లో ఉంటూ 8 గంటలు పనిచేయాల్సిన వీరిని 24 గంటలూ విధి నిర్వహణకు వాడుకోవడం శ్రమ దోపీడినే అని లోకేష్ ఆరోపించారు.
రిక్రూట్మెంట్ ఒక శాఖ కింద, విధి నిర్వహణ మరో శాఖలో ఉండడంతో ఎవరికీ చెందని వారిలా ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని లోకేష్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 7329 మంది ఎనర్జీ అసిస్టెంట్లు/జేఎల్ఎం గ్రేడ్-II ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. అందరినీ విద్యుత్ శాఖలో తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌శాఖలో జీత భత్యాలు అమలు చేయాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన వారికి విద్యుత్ శాఖ ఉద్యోగుల మాదిరిగానే పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మెడికల్ అలవెన్సులు ఇవ్వాలన్నారు. లేదంటే పూర్తిగా సచివాలయాల్లో నిర్దేశించిన పని గంటలకే విధులు నిర్వర్తించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తక్షణమే ప్రొబేషనరీ డిక్లేర్ చేయాలన్నారు. విద్యుత్ ఉద్యోగులకి అమలుచేసే పీఆర్సీకి అనుగుణంగా జీతాలు పెంచాలని ఎనర్జీ అసిస్టెంట్లు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌ని ఆమోదించాలని లోకేష్ అన్నారు. సచివాలయం వ్యవస్థ అనే బూటకపు ముసుగులో ఎనర్జీ అసిస్టెంట్లతో విద్యుత్ శాఖ గొడ్డు చాకిరీ చేయించుకోవడం ఇకనైనా ఆపాలని.. విద్యుత్‌శాఖ ఉద్యోగులకు ఇస్తున్న మెడికల్, సైకిల్ అలవెన్సు, కన్వేయన్స్, ఆర్జిత సెలవులు కూడా వర్తింపజేయాలని లోకేష్ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు.