తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆక్సిజన్ కొరతతో ఏపీలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారని… ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారని మండిపడ్డారు. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించండి జగన్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. “తిరుపతి రుయా ఆస్పత్రిలో వారు చనిపోలేదు, దయ లేని జగన్ ప్రభుత్వం చంపేసింది. 11 మంది కాదు 30 మంది మరణించారు అని రుయా ఆసుపత్రి ముందు నిరసన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక మహిళా ప్రత్యక్ష సాక్షి. మీడియాపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులతో వాస్తవాలు దాగవు. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారు. ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారు? ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించండి జగన్ రెడ్డి గారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన వారివి ప్రభుత్వ హత్యలుగా పరిగణించి వారి కుటుంబ సభ్యులను తక్షణమే ఆదుకోవాలి.” అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.