పెగాసస్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్‌పై హౌస్ కమిటీ వేసినా.. జ్యుడిషయరీ కమిటీ వేసినా.. సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వైఎస్ వివేకా హత్య విషయంలో, ప.గో. జిల్లాలో కల్తీ మద్యం మరణాల విషయంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా అని ప్రశ్నించారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదని లోకేష్ అన్నారు.
మమతా బెనర్జీ స్టేట్‌మెంట్ ఇచ్చారంటూ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌పై అసెంబ్లీలో చర్చ చేపట్టారని.. ఐదురోజులుగా టీడీపీ మద్యం, కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నా పట్టించుకోవడంలేదని నారా లోకేష్ ఆరోపించారు. సారా మరణాలను సీఎం జగన్ సహజ మరణాలుగా తీసిపారేయడం బాధాకరమని నారా లోకేష్ అన్నారు. ప.గో. జిల్లాలో కల్తీ సారా కారణంగా 42 మంది చనిపోయారని..ప్రజల ప్రాణాల కంటే పెగాసస్ పెద్ద సమస్యగా ప్రభుత్వానికి కనిపిస్తుందా అని ప్రశ్నించారు. అందుకే జగన్ మోహన్‌రెడ్డిని జగన్ మోసపురెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు అన్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్ అని వ్యాఖ్యానించారు.
మండలి బిజినెస్ లేకుండానే పెగాసస్‌పై సభలో చర్చ పెట్టారని విమర్శలు చేశారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు రిప్లై ఇచ్చారని.. వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని లోకేష్ వివరణ ఇచ్చారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా సభలో పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌పై స్వల్ప కాలిక చర్చకు మండలి ఛైర్మన్ అనుమతించారన్నారు. తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు ఛైర్మన్ అనుమతించలేదని.. తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్‌పై చర్చ పెట్టారని విమర్శించారు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారని.. భవిష్యత్‌లో వైసీపీకి 15 మంది కూడా ఉండని పరిస్థితి వస్తుందన్నారు. బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే ఆడారని.. డీఎస్పీ ప్రమోషన్‌ల విషయంలోనూ అబద్ధాలే చెప్తున్నారని లోకేష్ మండిపడ్డారు.