Srisailam Project: శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటిమట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు ఒక టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది.. అంటే ఇప్పుడు శ్రీశైలం జలాశయం లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరువగా అయిపోయింది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 837.5 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58.1456 టీఎంసీలు ఉంది.
Read Also: Rakul Preet : స్టైలిష్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సొగసులు..
అయితే, తెలంగాణ జెన్కో ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా రోజుకు ఒక టీఎంసీ నుంచి 2 టీఎంసీల వరకు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. ఇవాళ కూడా ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 19,493 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. బుధవారం సాయంత్రానికి 61.9240 టీఎంసీల నీరు డ్యామ్ లో ఉండగా ఇవాళ మధ్యాహ్నానికి 58.1456 టీఎంసీలకు తగ్గిపోయాయి. తెలంగాణ జెన్కో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఈ వాటర్ ఇయర్ లో మొత్తం 1600.50 టీఎంసీల నీరు కృష్ణ , తుంగభధ్ర నదుల నుంచి చేరింది. క్రస్టు గేట్ల ద్వారా 687.05 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసారు. ఏపీ జెన్కో కుడిగట్టు విద్యుత్ కేంద్రం లో 199.39 టీఎంసీల నీటిని వినియోగించి 1155.99 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తెలంగాణ జెన్కో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 398.41 టీఎంసీలు వినియోగించి 2058.86 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 41.78 టీఎంసీలు, మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా 29.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 211.48, టీఎంసీలు విడుదల చేసారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా 2.54 టీఎంసీలు విడుదల చేసారు. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రం లో ఉత్పత్తి నిలిపివేశారు.