Allagadda: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ తీసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న డ్రైవర్.. చాగలమర్రి టోల్ గేట్ దగ్గర ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని స్టేషన్ కు ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ తరలించాడు. ఈ సందర్భంగా 20 వేల రూపాయలు ఇవ్వాలని ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర ను ఎస్ఐ వేధించాడు. అయితే, రూ. 10 వేలు ఫోన్ పే ద్వారా పంపిన ట్రాక్టర్ డ్రైవర్.. మిగతా డబ్బులు ఇవ్వలేదని రవీంద్రను రూరల్ ఎస్ఐ హరి ప్రసాద్ వేధించాడు. దీంతో చేసేది లేక చెన్నంరాజు పల్లెకు చెందిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఎన్ రవీంద్ర విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ ను పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ హరి ప్రసాద్ పై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు నజర్ పెట్టారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.