Mahanandi Temple: మహానంది క్షేత్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేత సంఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు శివ సన్నిధిలో మృత్యువాత పడ్డారు. క్షేత్రంలోని గాజులపల్లె టోల్ గేట్ వద్ద పాతికేళ్ల క్రితం భక్తుల కోసం నాగనంది సదనం వసతి గృహాలను నిర్మించారు ఆలయ అధికారులు. అయితే, గదులు శిథిలమై పోవడంతో 50 గదుల నూతన వసతి గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నాగనంది సదనం కూల్చివేతను చేపట్టారు ఆలయ అధికారులు.
Read Also: Irregular Menstrual Cycle: మహిళలకి ఎందుకు ఋతు చక్రం సమస్యలు వస్తాయంటే?
నంద్యాల మండలం పెద్ద కోట్టాలకు చెందిన రాము, బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వకు చెందిన వెంకటేశ్వర్లు కూల్చివేత వద్ద పనిచేస్తుండగా పైకప్పు నుండి శిథిలాలు పెద్ద శబ్దం చేస్తూ వీరిపై పడ్డాయి. వెంటనే అక్కడే పని చేస్తున్న కూలీలు శిథిలాలను తొలగించారు. కానీ, అప్పటికే రాము మృతి చెందాడు. ఇక, ఈ ఘటనలో త్రీవంగా గాయపడ్డ వెంకటేశ్వర్లు నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. కానీ, చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు కూడా మరణించాడు. దీంతో మహానంది క్షేత్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఇద్దరి మృతిపై సంతాపం ప్రకటించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.