Tragedy In Nandyal District: నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఆ కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. గురు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర(15), గురులక్ష్మి(7) నిద్రలోనే ప్రాణాలు వదిలారు. రెండవ కుమార్తె చాగలమర్రిలో హాస్టల్లో వుంటూ చదువుతోంది. దీంతో ప్రసన్న ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెల్లు చనిపోయారని తెలియగానే హాస్టల్ నుంచి వచ్చింది. తల్లిదండ్రులు, చెల్లెళ్ళ మృతదేహాలు చూసి స్పృహ కోల్పోయి పడిపోయింది ప్రసన్న. మట్టి మిద్దె కావడంతో మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు.
Read Also: Paris Olympic 2024 : నేడు మరోసారి బరిలో మను భాకర్.. మూడో పతకం సాధించేనా?
ఇల్లు పాతది కావడం, వర్షాలకు బాగా తడిసి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలు శిథిలాల నుండి తొలగిస్తుండగా ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న స్థితిలోనే మృతి చెందారని కంటతడి పెట్టుకున్నారు స్థానికులు. గురు శేఖర్ రెడ్డి నిరుపేద కుటుంబం. పొలాలు కౌలుకు తీసుకోవడం, లేదంటే కూలి పనులకు వెళ్లి జీవనం గడపడం. ఈ విషాదం గ్రామంలో విషాదం నింపింది. ఇక, ఆ కుటుంబంలోని నలుగురు మృతిచెందగా.. హాస్టల్‌లో ఉండడం వల్లే.. మరో కూతురు ప్రాణాలు బయటపడినట్టు అయ్యింది.. అయితే, కుటుంబంలోని నలుగురు ఒకేసారి ప్రాణాలు వదలడం.. ఆ గ్రామంలో విషాదంగా మారింది.. వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. పాత ఇళ్లలో నివాసం ఉంటున్నవారు జాగ్రత్తగా ఉండాలని.. శిథిలావస్థలో ఉంటే.. వాటిని ఖాళీ చేయడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు..