ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో మాత్రం కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు కాకినాడ జిల్లా అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు తూర్పుగోదావరి అని పేరు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే కేబినెట్ భేటీలోని మెమోరాండంలో ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి అని… భీమవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో మాత్రం ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాజమండ్రి, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటు కానున్న జిల్లాలు ఎక్కువ భాగం గోదావరిని ఆనుకుని ఉండటంతో వాటికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అని పేర్లు పెట్టాలని కొందరు మంత్రులు చేసిన సూచనల మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు జిల్లాల విభజనపై రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడకు సమీపంలో ఉండే పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాలో కాకుండా… మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలపడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యం, గడివేముల మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.