ఏపీలో ఛలో కంతేరు నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్త వెంకాయమ్మ కుటుంబంపై దాడి ఘటనను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. దాడిపై పోలీసులుస్పందించలేదంటూ ఛలో కంతేరుకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కీలక నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీమంత్రి నక్కా ఆనందబాబులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈసందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. కంతేరు లో పోలీసుల ఎదుటే టీడీపీ నాయకులపై దాడి చేసారు. ఛలో కంతేరు కార్యక్రమాన్ని అక్రమ హౌస్ అరెస్ట్ లతో పోలీసులు అధికార పార్టీ కి వంతపాడుతున్నారని విమర్శించారు. డీఐజీ స్థాయి అధికారి రాజకీయ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కొట్టిన వారిని దెబ్బలు తిన్న వారిని ఒకే గాటన కట్టేస్తున్నారని దుయ్యబట్టారు నక్కా ఆనందబాబు. రౌడీ మూకలకు పోలీసులు వంత పాడితే రాబోయే రోజులలో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. టీడీపీ హయాంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు టీడీపీ నేతలు. అన్యాయం జరిగిందని అడిగితే అడ్డుకుంటున్నారన్నారు. వెంకాయమ్మ కుటుంబంపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చెయ్యకుండా అధికారపార్టీకి అనుకూలంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు జరుగుతున్న మైనింగ్ ఆగడాలు నా రాజకీయ జీవితంలో ఇంకెప్పుడూ చూడలేదన్నారు. సీఎం ఇసుక దోచేస్తుంటే , చోటా నాయకులు మట్టి మింగేస్తున్నారన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.
Viral Video: చిచ్చు పెట్టిన మిఠాయి.. వేదికపైనే కొట్టుకున్న వధూవరులు