వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని సీఎం జగన్ చెప్పిన మాటలు నిజమేనా అని ప్రశ్నించారు. ఇది నిజమే అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక 3వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని నిలదీశారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను జగన్ సర్కారు ఎందుకు లాక్కుందని సూటిగా అడిగారు.
Read Also: CM Jagan: చిప్ వేలికి, కాళ్లకు ఉంటే సరిపోదు.. చినమెదడులో ఉండాలి
కోనసీమ అల్లర్లలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని సీఎం జగన్ ఎందుకు ఖండించలేదో చెప్పాలని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిజంగానే 95 శాతం మేనిఫెస్టోలోని హామీలను అమలు చేశామని భావిస్తే దమ్ముంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజలను భయపెట్టించి స్థానిక సంస్థల్లో గెలిచారని.. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ పులివెందుల వెళ్లినప్పుడు బారికేడ్లు ఏర్పాట్లు చేసి షాపులు మూయించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. ఇన్నిరోజులుగా వైసీపీ సర్కారు గోబెల్స్ ప్రచారం చేసుకుని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గొప్పగా చెప్పుకుంటోందని.. పోలవరం ప్రాజెక్ట్ ఏమైందని నిలదీశారు. జగన్ పాలన బాగుంటే తాము నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వేల సంఖ్యలో అర్జీలు ఎందుకు వస్తున్నాయో చెప్పాలన్నారు.