MVV Satyanrayana Family Kidnapped : విశాఖ ఎంపీ, రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడు ఆడిటర్ను కిడ్నాప్ చేసిన వ్యవహారం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన భార్య కుమారుడు సహా తన ఆడిటర్ ఎంవి అలియాస్ యం వెంకటేశ్వరరావు సేఫ్ గా ఉన్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు. ఈ రోజు ఉదయం రిషికొండలో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళ్లిన దుండగులు ముందుగా ఎంపీ భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ భార్య చేత ఆడిటర్ వెంకటేశ్వరరావుకి కాల్ చేయించి ఇంటికి పిలిపించారు.
ఇంటికి పిలిపించిన తర్వాత ముగ్గురిని కిడ్నాప్ చేసి ఇంటి నుంచి తీసుకువెళ్లారు. అయితే వీరిని విశాఖపట్నంలో ఏలూరు రోడ్డులో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా ప్రకటించారు. తన భార్య, కుమారుడు, ఆడిటర్ కూడా సేఫ్ గానే ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతానికి పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదు కానీ ఈ ఘటనకు కారణం హేమంత్ కుమార్ అనే ఒక రౌడీషీటర్ అని ఎంపీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముగ్గురిని కిడ్నాప్ చేయడమే కాక 50 కోట్ల రూపాయలు తమకు చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడిస్తే కానీ అసలు ఏం జరిగింది? ఎందుకు ఎంపీ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేశారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే ఒక అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోందని చెప్పొచ్చు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారని చెబుతున్నారు.