ఏపీలో పొత్తు రాజకీయాలపై చర్చలు సాగుతున్న తరుణంలో.. ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. చంద్రబాబుకు సింగిల్‌గా వచ్చే దమ్ము లేకపోవడం వల్లే, ‘రండి కలిసి రండి’ అంటూ అడుక్కుంటున్నారని విమర్శించారు. దత్తపుత్రుడితో కలిసి, కుయుక్తులు పన్నాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చినా, జగన్‌ని ఎవరూ కదిపించలేరని వ్యాఖ్యానించారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ సింగిల్‌గా పోటీ చేశారని.. పొత్తులకు వెంపర్లాడలేదని చెప్పారు. సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.
గతంలో అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవని, జగన్ పాలనలో మాత్రం అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని నందిగం సురేష్ అన్నారు. పేదల సంక్షేమం కోసం తాము పథకాలు అమలు చేస్తోంటే, పేదలకు డబ్బులిస్తే సోంబేరుల్లా మారుతారని వ్యాఖ్యానించడం వాళ్ల ఆలోచనా ధోరణికి నిదర్శనమని చెప్పారు. అలసిపోయిన వారికి బాసటగా ఉంటుందనే ఆలోచనతో సీఎం జగన్ పథకాలు తీసుకొచ్చారని, కానీ ప్రతిపక్షం అది సహించడం లేదని వెల్లడించారు. అత్యాచారాలు, మహిళలపై దాడుల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. కానీ, గత ప్రభుత్వంలోనే ప్రజలు చాలా కష్టపడ్డారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరూ సంతోషంగా ఉన్నారన్నారు.
ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని సురేశ్ విమర్శించారు. లోకేష్ మూర్ఖుడని చెప్పుకుంటున్నారని, ఆయన మూర్ఖుడే కాదు పప్పు కూడా అంటూ సెటైర్స్ వేశారు. ప్రజా క్షేమం కోసం మళ్లీ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వచ్చేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు.