సంక్రాంతి వచ్చిందంటే చాలు గ్రామాల్లో సందడే సందడి. కొత్త అల్లుళ్ళు అత్తారింటికి వచ్చి సందడి చేస్తారు. వేరే రాష్ట్రాల్లో, నగరాల్లో ఉండే ఉద్యోగులు స్వస్థలాలకు, గ్రామాలకు చేరుకుంటారు. సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో గ్రామాల్లో హరిదాసులు సందడి కూడా ప్రారంభం అయింది. గతంలో ఉదయన్నే హరి నామ స్మరణలతో కాళ్లకు గజ్జెలు కట్టుకుని, నడుచుతుంటూ ప్రతి ఇంటికి వచ్చేవారు హరిదాసులు. కానీ ఇప్పుడు మోటార్ సైకిల్ పై వస్తూ మైక్ సెట్ ను అమర్చుకుని సందడి చేస్తున్నారు హరిదాసులు. తెలుగు రాష్ట్రాలలో పండులప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉండేది. రానురాను వీరికి ఆదరణ తగ్గుతుందనేది నిర్వివాదాంశం.
హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అంటే పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు. ధనుర్మాసం ప్రారంభం నుంచి సంక్రాంతి పూర్తయ్యేవరకూ వీరంతా గ్రామాల్లో తిరుగుతూ వుంటారు. నెలరోజులు పాటు వీధి వీధినా హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తుంటారు.
ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను కిందకు దించరు. దానిని చేతితో కూడా తాకరు.ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.
Read Also: Heavy Drug Seizure: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత
హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. హరిదాసు నడుస్తుంటే లయబద్ధమయిన శబ్ధం అందరికీ మేలుకొలుపులా వుంటుంది. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు.
తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. కాలంతో పాటుగా హరిదాసులు వాహనాల మీదే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రికార్డు చేయించిన హరినామ కీర్తనలను మైక్ ద్వారా ప్రజలకు వినిపిస్తున్నారు. హరినామ సంకీర్తన చేస్తున్నారు. తమకు జీవనోపాధి తగ్గిపోయిందని, గతంతో పోలిస్తే తమకు ఆదరణ తగ్గుముఖం పట్టిందని అంటున్నారు.
Read Also: Cell Phone: సెల్ ఫోన్ చిచ్చు.. కూతురుని గొంతు నులిమి చంపిన తండ్రి