కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసు కస్టడీ పిటిషన్ పై మిస్టరీ నెలకొంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కు పొంతనలేదు. మరో కొత్త సీన్ క్రియేట్ చేయడానికే కస్టడీ పిటిషన్ వేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు మృతుడు తల్లి ఈ హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పోలీసులు కొత్త చిక్కుల్లో పడతారా అనేది చర్చనీయాంశంగా మారింది.
గత నెల 19న తన డ్రైవర్‌ను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య సమయంలో ఇంకా ఎవరి సాయం తీసుకున్నాడు? ఎవరెవరు ఇందులో పాల్గొన్నా రనేది సెల్‌ఫోన్ కాల్‌డేటా, వాట్సాప్‌కాల్, చాట్ వివరాలు బయటకు వస్తే మరింత స్పష్టత రానుంది. వాస్తవానికి కేసు దర్యాప్తునకు సంబంధించి అసలు హత్య ఎక్కడ జరిగింది? అనేదానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. శశికాంత్‌నగర్‌లోని తన అపార్ట్‌మెంట్ వద్ద డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ క్రమంలో వెనక్కు నెట్టడంతో తలకు దెబ్బ తగిలిందని, ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసేలోగానే చనిపోవడంతో నగర శివారు ప్రాంతంలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకువెళ్లి మృతదేహాన్ని చితక్కొట్టినట్టు అనంతబాబు పోలీసులకు వివరించారు.
అయితే హత్య కేసు తీవ్రతను తగ్గించడానికే అనంతబాబు ఈ నాటకం ఆడినట్టు తెలిసిపోతోంది. కానీ ఆ రోజు రాత్రి అపార్ట్‌మెంట్‌కు సమీపంలో అసలు ఎలాంటి కొట్లాట జరగలేదని అనంతబాబు అపార్ట్‌మెంట్ వద్ద పనిచేసే వాచ్‌మెన్ స్పష్టంగా చెప్పాడు. ఈనేపథ్యంలో అసలు హత్య చేసిన ప్రదేశం ఏదనేది తేలాలంటే అనంతబాబు ఫోన్ ఆరోజు రాత్రి ఏఏ ప్రాంతాల సెల్‌టవర్ పరిధిలో ఉందో తేలాలి. తద్వారా హత్య చేసిన ప్రదేశం ఎక్కడనేది అసలు నిజం బయటకు రానుంది. మరోపక్క హత్య జరిగిన మే 19 వ తేదీన రాత్రి ఇంటి నుంచి తమ కొడుకు సుబ్రహ్మణ్యంను అనంత బాబు స్నేహితుడు మణికంఠ వచ్చి తీసుకువెళ్లాడని మృతుడి తల్లి రత్నం చెబుతోంది.
పోలీసులేమో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మద్యం సేవించిన తర్వాత రోడ్డుపైకి వచ్చి కూర్చోవడంతో అదే దారిలో వెళ్తున్న అనంతబాబు పిలిచి కారు ఎక్కించుకుని తీసుకువెళ్లాడని అంటున్నారు. పోలీసులు చెప్పినట్టే సుబ్రహ్మణ్యంను కారు ఎక్కించుకున్న తర్వాత రాత్రి అనంతబాబు ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్లాయనేది కీలకం కానుంది. మొత్తం ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత నెల 19న డ్రైవర్‌ను హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి పరారైన అనంతబాబును తిరిగి నాలుగు రోజుల తర్వాత మే 23 ఉదయం అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతడి ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వ్యవధిలో అనంతబాబు తన ఐఫోన్‌లో కాల్స్, వాట్సాప్ కాల్ డేటాను డిలీట్ చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి.
కొందరు పోలీసుల సలహాల ప్రకారమే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.ఇక హత్య చేసిన తర్వాత అనంతబాబు తన ఫోన్‌లో అదే సిమ్ ఉంచాడా? లేదా సిమ్ మార్చి వేరే నెంబర్ పెట్టాడా? అనేదానిపై సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే హత్య చేసిన రోజు ఫోన్ లో ఉన్న సిమ్ ద్వారానే అనంతబాబు కదలికలు, ఎవరితో మాట్లాడాడు, హత్య చేసిన తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశానని చెబుతున్న అనంతబాబు ఇదే నిజమైతే హత్య తర్వా త ఎవరికి కాల్ చేశాడు? వంటి వివరాలు బయటకు రావాలి. తద్వారా మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవేవీ బయటకు రాకుండా సిమ్ మార్చేసి వేరే సిమ్ పెట్టాడా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఒకవేళ సిమ్‌మార్చి అదే ఫోన్ వాడితే అరెస్ట్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ ద్వారా ఏ వివరాలు బయటకు రావు. తద్వారా కేసు దర్యాప్తు పక్కదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే హత్య చేసిన రోజు అర్ధరాత్రి 12.50 గంటలకు తమకు అనంతబాబు తన సెల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యంకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పినట్టు తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఈనేపథ్యంలో స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో ఉన్న సిమ్ అదా కాదా? అనేదానిపై పోలీసులు స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ సిమ్ అదే అయితే హత్య చేయడానికి ముందు, చేసిన తర్వాత, అరెస్ట్ అయిన నాలుగురోజుల వ్యవధిలో ఆ నెంబర్ నుంచి బయటకు వెళ్లిన కాల్స్ అన్నీ బయటకు తీయాలి.
తద్వారా హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. మరోపక్క హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాడిన శ్యాంసంగ్ ఫోన్ పోలీసుల స్వాధీనంలో ఉంది. అయితే ఈ నెంబర్ నుంచి కొన్నిరోజుల ముందు వెళ్లిన కాల్స్, వాట్సాప్ చాటింగ్ తదితర వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాగా సంచలనాత్మకమైన ఈ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తులో ఏ వివరాలు బయటకు పొక్కకుండా పోలీసులు పూర్తిగా గోప్యత పాటిస్తున్నారు. కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డీఎస్పీ భీమా రావు అసలే మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం.
అనంతబాబు పోలీసులకు చెప్పిందానికి, వాష్తవాలకు అసలు సంబంధం లేకుండా ఉంది. పోస్టుమార్టం రిపోర్టులో కొట్టి చంపివేసినట్లు, మృతుడు ఒంటిపై 31 గాయాలు ఉన్నట్లు తేలింది. పోలీసులు సీడీ ఫైల్ లో అనంతబాబు చెప్పినవి వాస్తవం కాదని ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో అనంతబాబు ఒక్కరే హత్య చేసినట్లు ఉంది. అనంతబాబు తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్ లో కారు డ్రైవర్ యాక్సిడెంట్ లో చనిపోయాడని పేర్కొన్నారు.
అరెస్టు చేసిన14 రోజుల్లో పోలీసులు నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారించాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, అరెస్టు చేసిన రోజే కస్టడీకి కోరతామని చెప్పిన పోలీసులు రిమాండ్ గడువు ముగిసిన రోజు చివరి క్షణంలో కస్టడీ పిటిషన్ వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ ఈనెల 13వ తేదీన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణకు రానున్నాయి. మరోవైపు మృతుడు తల్లి నూకరత్నం పోలీసులపై నమ్మకం లేదని, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసును సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్, డీజీపీ, చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
TSRTC : ఆగని దోపిడీ.. నిన్న గ్యాస్ .. నేడు బస్ పాస్