Site icon NTV Telugu

Kakinada: జఠిలంగా మారిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కేసు

Mlc Ananthababu

Mlc Ananthababu

కాకినాడ జీజీహెచ్‌ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా సంతకం పెట్టేందుకు నిరాకరించి తలను గోడకేసి కొట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు పోస్టుమార్టం కోసం సుబ్రమణ్యం కుటుంబసభ్యులతో పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

Kakinada Tension: కాకినాడలో టెన్షన్ టెన్షన్

కాగా సుబ్రమణ్యం మృతి కేసులో కుటుంబ సభ్యులు, బంధువులు శవ పంచనామాకు సహకరించి వాంగ్మూలాలు ఇస్తే ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. ఈ కేసును ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుందని.. ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం, డీజీపీ నుంచి ఆదేశాలు అందాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అందువల్ల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ విషయాన్ని గమనించి ఈ కేసు తదుపరి దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు.

Exit mobile version